‘కొబ్బరిమట్ట’ ట్రైలర్ రివ్యూ!
‘హృదయకాలేయం’ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తొడగొట్టి వస్తున్న ‘కొబ్బరిమట్ట’ ట్రైలర్ ఏక పాత్రాభినయంతో నాటక దృశ్యంలా వుంది. నిడివి ట్రైలర్ కి ఎక్కువే. ఏకంగా మూడు నిమిషాల 17 సెకండ్ల నిడివితో సంపూర్ణేష్ ఏకదాటి మోనోలాగ్ పౌరాణికాల స్టయిల్లో టాలెంట్ ప్రదర్శనలా వుంది. ఈ డైలాగుతో పెద రాయుడు పాత్ర పోషించాడు. తల్లిని చూపిస్తూ తనని అనాధగా వదిలేసిన తండ్రి పెదరాయుడు మీద డైలాగులు కొట్టాడు. ఫన్నీగా, నవ్వొచ్చేట్టుగా వుందీ ట్రైలర్. ఇంత సుదీర్ఘ డైలాగు సినిమాల్లో ఇదే మొదటిసారి కావొచ్చు.
‘కొబ్బరిమట్ట’ బయట పడడానికి ఇంత కాలం పట్టింది. అయినా ప్రేక్షకులకి తన గైర్హాజరీ లోటు తీరుస్తూ ఇందులో మూడు పాత్రల్లో కన్పించబోతున్నాడు : పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు. 2014 లో ‘హృదయకాలేయం’ అనే సెటైరికల్ కామెడీతో ఓ మెరుపు మెరిసిన సంపూర్ణేష్, దాంతో ఏక్ మూవీకా సుల్తాన్ గా మిగిలిపోయాడు. ఆ తర్వాత నటించిన ‘సింగం -123’, ‘వైరస్’ లతో ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ‘బందిపోటు’, ‘కరెంట్ తీగ’ వంటి ఇతర హీరోల సినిమాల్లో నటించి కూడా కమెడియన్ గా ఆకట్టుకోలేకపోయాడు. దాదాపు సంపూర్ణేష్ ని మర్చిపోయారనుకుంటున్న సమయంలో ‘కొబ్బరిమట్ట’ తో ప్రత్యక్షమయ్యాడు. ఇదెప్పుడో మూడేళ్ళ క్రితం విడుదలవ్వాల్సింది. దీని ట్రైలర్ కూడా 2016 లోనే విడుదలయింది.
‘కొబ్బరి మట్ట’ యాక్షన్ కామెడీ ట్రైలర్ లో సంపూర్ణేష్ ఏకపాత్రాభినయం ప్రేక్షకుల్ని ఎంత వరకు థియేటర్లకి రప్పిస్తుందో చూడాలి. ఈ చాంతాడంత డైలాగుల మోతలో దాదాపు అందరు తెలుగు స్టార్స్ నీ వాళ్ళ ఇంటి పేర్లతో ప్రస్తావిస్తూ ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ స్పూఫ్ నీ, సెటైర్స్ నీ ఆల్రెడీ పృథ్వీ గుత్తకి తీసుకుని పీల్చి పిప్పి చేశాడు. ఇప్పుడు సంపూర్ణేష్ ఈ లేటు రిలీజుతో ‘కొబ్బరిమట్ట’ లోంచి ఇంకేదో పిండాలని యాక్టివేట్ అయ్యాడు. ట్రైలర్ కి మాత్రం పదహారు గంటల్లో నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. మంచి రెస్పాన్సే. ఈ రెస్పాన్స్ రేపు సినిమాకి ఉంటుందేమో చూడాలి.
ఇందులో తారాగణం కూడా వెరైటీగా వుంది. సంపూర్ణేష్ తో బాటు ఇషికా సింగ్, షకీలా, కత్తి మహేష్, గాయత్రీ గుప్తా నటించారు. ‘హృదయకాలేయం’ నిర్మాత, దర్శకుడు, రచయితా స్టీవెన్ శంకర్ దీనికి రచన చేస్తూ తనే నిర్మాతగా వున్నాడు. దర్శకత్వం రూపక్ రోనాల్డ్ సన్ కప్పగించాడు. సంగీతం కమ్రాన్. విడుదల ఆగస్టు 10.