తెలుగులో ఈమధ్య చిన్న సినిమాల సందడి ఎక్కువైంది. స్టార్లతో పని లేకుండా కథను మాత్రమే నమ్ముకుని వస్తున్న ఈ చిన్న సినిమాల్లో కొన్ని మ్యాజిక్ చేస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే ‘సినిమా బండి’. రాజ్ అండ్ డీకే నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్ట్ చేశారు. కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో కూడ తెలియని ఆమాయకుల బృందం సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ. తన ఆటోలో దొరికిన ఒక కెమెరాను పట్టుకుని ఊళ్లోనే హీరో హీరోయిన్లను వెతుక్కుని ఒక ఆటో డ్రైవర్ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డాడు అనేదే కథనం. కథలో ప్రధాన ఆకర్షణ స్థానికత. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడి నెటివిటీని వందకు వంద శాతం ఒడిసిపట్టాడు దర్శకుడు.
కథలోని ప్రతి పాత్ర ఎంతో సహజత్వం నిండి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతో క్లిష్టంగా ఉండే వారి తెలుగు యాస వినేకొద్ది వినాలనిస్తుంది. ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ ఫిల్మ్ మేకర్ ఎట్ హార్ట్’ అనే విషయాన్ని చెప్పదలచుకొన్న డైరెక్టర్ జీవం ఉన్న కథాంశాన్నే తీసుకున్నాడు. పాత్రలని కూడ సహజంగా ఉండేలా రాసుకున్నారు. సినిమా తీయడానికి టీమ్ తయారు చేసుకోవడం, షూటింగ్ చేయడానికి వాళ్ళు పడే తిప్పలు, హాస్యపూరిత సన్నివేశాలు, పాత్రల్లోని అమాయకత్వం ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్ర నిజాయితీగా కనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన పోకడలకు పోలేదు దర్శక నిర్మాతలు. నటీనటులు అందరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు.
కథలో ప్రధాన పాత్ర ఎవరైనా సినిమా తీయవచ్చని అనుకుంటుందే తప్ప సినిమా తీయాలనే తపన మొదటి నుండి ఆ పాత్రలో కనబడదు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిస్తుంది. బడ్జెట్ సమస్యల వలన కొద్దిగా క్వాలిటీ లోపించి డాక్యుమెంటరీని తలపిస్తుంది చిత్రం. సినిమా ఆధ్యంతం కథనం నెమ్మదిగానే సాగుతుంది తప్ప ఎక్కడా వేగం అందుకోదు. ఈ చిన్న చిన్న లోపాలను మినహాయిస్తే ఈ లాక్ డౌన్ సమయంలో ఒక అమాయక బృందం సినిమా తీస్తే ఎంత ఆసక్తిగా ఉంటుందో ఇంట్లో కూర్చుని ఈ ‘సినిమా బండి’ని చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు.