నటీనటులు: మహేష్‌బాబు, ప్రత్యేక అతిథి పాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ, విజయశాంతి, రష్మిక మందన్న, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, సత్యదేవ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, అజయ్, సుబ్బరాజు, నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, బండ్ల గణేష్, పవిత్రా లోకేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: అనిల్ సుంకర, మహేష్‌బాబు, దిల్ రాజు,
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 11-01-2020
రేటింగ్: 3.5
భరత్ అనే నేను, మహర్షి వంటి రెండు సూపర్ హిట్‌ల తరువాత రెట్టించిన ఉత్సాహంతో వున్నారు మహేష్. ఈ సారి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని చేయాలని ఫిక్స్ అయిన అందులో మంచి పట్టున్న అనిల్ రావిపూడితో తన నెక్ట్స్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే అందరిని సర్‌ప్రైజ్ చేసిన ఈ సినిమా బడ్జెట్, కాస్టింగ్ దగ్గరి నుంచి ప్రీరిలీజ్ ఈ వెంట్ వరకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే వుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్‌లో చిరంజీవి పాల్గొనడం, మహేష్‌ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయడం, మీడియా ప్రమోషన్స్‌లో మహేష్ ఈ సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవాలంతే వంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంతో ఈ సినిమాకు ఎక్కడలేని హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ హైప్‌కి తగ్గట్టే సినిమా వుందా? తొలిసారి ఆర్మీ మేజర్‌గా నటించిన సూపర్‌స్టార్ మహేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారా? మహేష్ నుంచి ఆయన అభిమానులు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అవన్నీ `సరిలేరు నీకెవ్వరు`లో వున్నాయా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
భారతి( విజయశాంతి) ఓ ప్రొఫెసర్. దేశభక్తి ఎక్కువ. దేశం కోసం తన ఇద్దరు కుమారుల్ని సైన్యంలోకి పంపిస్తుంది. ఒక కొడుకు సైన్యంలో జరిగిన ఆపరేషన్‌లో చనిపోతే మరో కొడుకు (సత్యదేవ్) గాయానికి గురవుతాడు. ఈ విషయం చెప్పాలని, ఆ కుటుంబానికి అండగా వుండాలని ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణ కర్నూలుకు వస్తాడు. అయితే అతనికి భారతి కుటుంబం కనిపించదు. ఎక్కడ వుందో తెలియదు. భారతి కుటుంబం కనిపించకుండా పోవడానికి స్థానిక ఎమ్మెల్యే నాగేంద్రకు ఉన్న సంబంధం ఏమిటి?, భారతి కుటుంబం కోసం అజయ్‌కృష్ణ ఏం చేశాడు? అందుకు అతనికి ఎదురైన సమస్యలేంటీ? సంస్కృతి (రష్మిక), అజయ్‌ల మధ్య పరిచయం ఎక్కడ జరిగింది?. ఆమెకు, భారతి కుటుంబానికున్న సంబంధం ఏమిటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
`దూకుడు` తరువాత మహేష్ మంచి ఈజ్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీని ట్రై చేసి చాలా కాలమే అవుతోంది. ఎప్పటి నుంచే ఆ లోటుని తీర్చాలని అనుకుంటున్నా మహేష్‌లోని హ్యూమర్‌కు తగ్గ కథ, పాత్ర కుదరలేదు. గత కొంత కాలంగా సీరియస్ టచ్ వున్న పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ వస్తున్న మహేష్ వాటి నుంచి చిన్న రిలీఫ్ కావాలని కోరుకుని మరీ చేసిన చిత్రమిది. ఆయన భావించినట్టే సినిమాలో ఫుల్ ఫన్‌ని తన పాత్రతో క్రియేట్ చేశారు. ట్రైన్ ఎపిసోడ్ రష్మిక ఎంత అల్లరి చేస్తే అంతకు రెట్టింపు అల్లరి మహేష్ చేశారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్టే నవ్వుల్ని కురిపిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్స్‌ని, డ్యాన్స్, ఫైట్స్.. ఇలా ప్రతీ సన్నివేశంలోనూ హుశారుగా కనిపించారు. ఈ సంక్రాంతికి మహేష్ తన ఫ్యాన్స్‌కిచ్చిన కంప్లీట్ ప్యాకేజ్‌గా ట్రీట్ అనుకోవచ్చు. తొలిసారి మహేష్‌తో కలిసి నటిచినా రష్మిక కొన్ని కొన్ని సీన్‌లలో డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. కొన్ని ఓవర్‌గా అనిపిస్తాయి కూడా. ట్రైలర్‌లో రష్మిక పాత్రకి ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు కనిపించినా సినిమాలో మాత్రం పెద్దగా ఉపయోగం లేని పాత్రగా కనిపించింది.
ఇక 13 ఏళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి భారతి పాత్రలో ఒదిగిపోయారు. ఆమె మాత్రమే ఈ పాత్ర చేయాలని అనిల్ రావిపూడి ఎందుకు పట్టుబట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. భారతి పాత్రలో చాలా హుందాగా కనిపించారామె. ఆమె కమ్ బ్యాక్‌కు సరైన పాత్ర లభించింది. బండ్ల గణేష్ కామెడీ అనుకున్న స్థాయిలో లేదనిపించింది. ప్రకాష్‌రాజ్ విలన్‌గా తనదైన మార్కుని చూపించారు. ఇక మిగతా పాత్రల్లో నటించిన రాజేంద్రప్రసాద్, సంగీత, సత్యదేవ్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, అజయ్, సుబ్బరాజు, నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, బండ్ల గణేష్, పవిత్రా లోకేష్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
ఆడియో పరంగా కొంత వీక్ అనిపించినా నేపథ్య సంగీతంతో ఆ లోటుని పూడ్చే ప్రయత్నం చేశాడు దేవిశ్రీప్రసాద్. సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్, ప్రకాష్‌రాజ్ పరిచయ సన్నివేశం, ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లకు తనదైన బీజీఎమ్స్‌తో ఆ సన్నివేశాలని మరింత ప్రభావవంతంగా ఎలివేట్ చేశాడు. విజువల్స్ విషయంలో రత్నవేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఫారెస్ట్ సీన్స్, కొండారెడ్డి బురుజు ఫైట్. ఇలా సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ని చాలా లావిష్‌గా, అందంగా తీర్చిదిద్ది సినిమాకు మరింత వన్నె తెచ్చారు. అయితే తమ్మిరాజు కత్తెరకు మరింత పనికల్పించి వుంటే బాగుండేది అనిపిస్తుంది. నిడివిని కొంత తగ్గిస్తే బాగుండేమో అనిపించక మానదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే అనిల్ కథని మరింత కొత్తగా రాసుకుని వుంటే బాగుండేది. పాత కథకే సైన్యం, ఫ్యామిలీ ఎమోషన్స్, పొలిటికల్ టచ్‌ని ఇవ్వడం కొంత నిరాశపరుస్తుంది. అయితే తన మార్కు పంచ్‌లతో, ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే సన్నివేశాలతో సినిమాని పూర్తిగా నింపేశాడు. ఇది అనిల్‌కి కలిసి వచ్చేలా వుంది.
విశ్లేషణ:
తొలి భాగాన్ని డిసెంట్‌గానే ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఆర్మీ ఆపరేషన్, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ లతో ఆకట్టుకున్నాడు. తొలి భాగాన్ని సాఫీగానే సాగించాడు కానీ సెకండ్ హాఫ్ ప్రారంభం అయిన తరువాత 20 నిమిషాల పాటు స్టోరీ మరీ మందగించడం నీరసాన్ని తెప్పిస్తుంది. అయితే మైండ్ బ్లాక్ సాంగ్, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతితో వచ్చే ఎమోషనల్ సీన్స్, టైటిల్ సాంగ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. ఇక క్లైమాక్స్‌ని సాదా సీదాగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల మూసలోనే ఎండ్ చేసిన తీరు పేలవంగా వుంది. సగటు ప్రేక్షకుడితో పాటు మహేష్ అభిమానుల్ని కూడా చిరాకు పెట్టిస్తుంది. ఇంత మంచి ఆఫర్‌ని అనిల్ మరింత బెటర్ గా వాడుకుని వుండాల్సింది, అలా చేస్తే ఫలితం మరింత బెటర్‌గా వుండేది అనిపిస్తుంది. కామెడీనే నమ్ముకున్నా అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. అయితే ఫ్యాన్స్‌ని మాత్రమే ప్రసన్నం చేసుకోవాలని అనిల్ చేసిన ఈ ప్రయత్నం మాత్రం ఫలించింది అని చెప్పాల్సిందే. సినిమాలో అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ వున్నా ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` ఫర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.