స్టార్ మెటీరియల్ కావలెను –‘గ్యాంగ్ లీడర్’ స్క్రీన్ ప్లే విశ్లేషణ
‘118’ నుంచీ ‘గ్యాంగ్ లీడర్’ వరకూ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆశాజనకంగా 10 సస్పెన్స్ థ్రిల్లర్లు విడుదలయ్యాయి. 118, గేమ్ ఓవర్, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, నిను వీడని నీడను నేనే, రాక్షసుడు, కథనం, ఎవరు, ఏదైనా జరగొచ్చు, గ్యాంగ్ లీడర్. వీటిలో 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు – తప్ప మిగిలినవి ఫ్లాపయ్యాయి. పదిలో 5 ఫ్లాప్స్. ఒక జానర్లో తీసినవన్నీ హిట్టవ్వాలని లేదు. ప్రేమ జానర్లు, దెయ్యం జ్వరాలూ మార్కెట్ కోల్పోయి సస్పెన్స్ థ్రిల్లర్లు మార్కెట్ ని భర్తీ చేయడం మంచిదే, ప్రేక్షకులు కూడా సంతోషంగా వున్నారు లేకి ప్రేమలు, పిచ్చి దెయ్యాలు వదిలాయని. సస్పెన్స్ థ్రిల్లర్లు చిన్న సినిమాలు. వీటిని స్టార్లు నటిస్తున్నప్పుడు రిస్కే అవుతుంది. వీటి కథల్లో స్టార్ మెటీరియల్ వుండదు. ఈ తొమ్మిది నెలల్లో విడుదలయిన పది సస్పెన్స్ థ్రిల్లర్స్ లో తొమ్మిదీ చిన్న, మధ్య తరగతి హీరోలవే. గ్యాంగ్ లీడర్ ఒక్కటే స్టార్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో పాత్రకీ, కథకీ స్టార్ మెటీరియల్ లేకపోవడంతో ఫ్లాపయ్యింది. ఒక రేంజికి ఎదిగిన నేచురల్ స్టార్ నాని లాంటి మాస్ – కమర్షియల్ సినిమాలతో స్ట్రాంగ్ ఇమేజి వున్న స్టార్లు, హిట్టయిన 118, ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా, రాక్షసుడు, ఎవరు –లలో ఏది నటించినా స్టార్ మెటీరియల్ దోషంతో ఫ్లాపవుతుంది. యాక్షన్ కామెడీలు, యాక్షన్ థ్రిల్లర్లు వాళ్ళ జోన్. జర్నలిస్టు పాత్ర వాళ్ళ రేంజి, రచయిత పాత్ర కాకుండా.
గ్యాంగ్ లీడర్ కథకి బలహీనంగా వున్న క్రియేటివ్ యాస్పెక్ట్ ని దిద్దుకుంటే మార్కెట్ యాస్పెక్ట్ బావుండేదే. ఆ క్రియేటివ్ యాస్పెక్ట్ లో స్టార్ ని వూహిస్తే మాత్రం మార్కెట్ యాస్పెక్ట్ వుండే అవకాశం లేదు. ఈ కథ కాన్సెప్టు, లేదా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ తో కళకళ లాడేదే స్టార్ ని వూహించకుంటే. శ్రీ విష్ణు, లేదా ‘ఆత్రేయ’ బ్రాండ్ నవీన్ పొలిశెట్టి లాంటి చిన్న రేంజర్లు వుంటే ఈ కాన్సెప్ట్ కి న్యాయం జరిగే మాట. ఇందులో తారాగణంలో ఒకటి గమనిస్తే, నానికి సూటయ్యే స్టార్ హీరోయిన్ ఇందులో లేదు. ఎందుకు లేదు? వుంటే లీడ్ క్యారక్టర్ లక్ష్మి ఫేడవుట్ అవుతుంది కాబట్టి. పైగా ఇందులో హీరోయిన్ కి పనికూడా లేదు కాబట్టి. కనుక ఈ కథ నాని అవసరాన్ని కూడా డిమాండ్ చేయని రేంజిలో నే వుందని అర్ధం జేసుకోవాలి. పెద్ద సినిమాలు తీసే దర్శకుడు విక్రం కుమార్ తన ప్రతీ కథా పెద్ద సినిమాకి తగును అనుకోవడం తగని పనైంది. పెద్ద సినిమాలు తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కిది వరసగా క్రియేటివ్- మార్కెట్ యాస్పెక్ట్ లు పని చేయని ఐదో పరాజయమైంది.
స్ట్రాంగ్ గా వున్నది ట్రైలరే
ట్రైలర్ స్ట్రాంగ్ టీలా వుంది. స్టార్ మెటీరియల్ అన్పిస్తూ కారు ఛేజింగులు, విలన్స్ తో ఫైట్స్, గన్ ఫైర్స్, బ్లాస్టింగ్స్ వగైరాలతో వైరల్ అయింది. ఐదుగురు ఆడవాళ్ళతో నానీస్ గ్యాంగ్ ‘ఓషన్స్ ఎలెవన్’ లెవెల్లో ఫోజిస్తూ నడుస్తూంటే, ‘యుద్ధానికి సిద్ధం కండి, సమర శంఖం నేనూత్తాను’ అని నాని డైలాగేస్తే, ‘నేనింకా థ్రిల్లర్ జానర్‌లోనే వున్నాను, సైకో థ్రిల్లర్ జానర్లోకి మారక ముందే మొదలెట్టేద్దాం’ అని విలన్ కార్తికేయని కార్నర్ చేస్తూంటే, ఒక ఫుల్ రేంజి సస్పెన్స్ / యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ అన్నట్టు ఆశలు కల్పించింది. తీరా సినిమాలో ఇవన్నీ ఓ రెండు మూడు సీన్లలో వున్న షాట్స్ ని ఏర్చికూర్చినవే తప్ప మరేమీ కాదని తేలింది. ఈ ట్రైలర్ లో కనబర్చిన కంటెంట్ ని సినిమాలో కూడా కనబర్చి వుంటే ఏంతో బావుండేది.
ముఖ్యంగా ఈ కథకి జానర్ మర్యాద లోపించింది. రెండోది స్ట్రక్చర్ సమస్య. స్ట్రక్చర్ ఏం డిమాండ్ చేస్తుందో ఆ ప్రకారం కథనం లేదు. ప్రారంభంలో రాత్రి పూట ముసుగేసుకున్న ఆకారాలు హైటెక్కుగా బ్యాంకుని దోచుకునే దృశ్యాల దగ్గరే ఈ కథ చప్ప బడిపోయింది. ఎడ్గార్ వాలెస్ నవలల్లో ముసుగు ఆకారాలు బ్యాంకుని దోచుకున్నాయని రాయవచ్చు. నవల చదవడం మనసులో ఊహించుకోవడం కాబట్టి ఇబ్బంది వుండదు. సినిమా చూడ్డం కళ్ళతో చూడ్డమైనప్పుడు ఆ కళ్ళు టీవీ ఛానెల్ కవరేజిని డిమాండ్ చేస్తాయి. ముసుగేసుకోకుండా ఓపెన్ ఫేసులతో క్యారక్టర్లుంటే, రక్తితో, కిక్కుతో, ప్రేక్షకులకి బాగా రిజిస్టరై కథలో లీనం చేస్తాయి. ఏ సినిమాలో నైనా ఓపెనింగ్ బ్యాంగులు ఓపెన్ గానే వుంటాయి. ఎవరేం చేశారో చూపించేస్తారు. అప్పుడే ఆ బ్యాంగ్ కథకి హుక్ లా అర్ధవంతంగా పనిచేస్తుంది.
ఈ సినిమాలో చీకట్లో ఎవరేమిటో తెలీని ముసుగు ఆకారాల దోపిడీ ఆపరేషన్ ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా, ఇంటరాక్టివ్ వ్యూయింగ్ కి వీల్లేకుండా, ఉత్త పాసివ్ వ్యూయింగ్ తో చప్పగా వుంది. ఎక్కడో నవలలో చదివింది చదివినట్టు దృశ్యాలంకరణ చేసినట్టుంది. లేదా ఇంకే సినిమాలోనో పరిచయమైన క్యారెక్టర్లు ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, మిడ్ పాయింట్ లోనో ముసుగులేసుకుని పాల్పడ్డ దోపిడీ దృశ్యాల్ని ఇక్కడ ఓపెనింగ్ కి వాడుకున్నట్టుంది. తెలిసిన క్యారక్టర్లు కథ మధ్యలో ముసుగులేసుకుని దోపిడీ చేస్తే ఇంటరాక్టివ్ వ్యూయింగ్ కి దెబ్బ రాదు, ఎందుకంటే వాళ్ళెవరో మనకి తెలుసు కాబట్టి. ఇలా ఏదో సినిమాలో కథ మధ్యలో వున్న దోపిడీ దృశ్యాల్ని ఆలోచించకుండా ఓపెనింగ్ బ్యాంగ్ కి వాడుకున్నట్టుంది. ‘నిను వీడని నీడను నేనే’ లో ‘సిక్త్ సెన్స్’ లో వున్న ముగింపు ట్విస్టుని తెచ్చుకుని కథ నడపబోయి బోల్తా పడలేదా?
ఒకవేళ ఈ దోపిడీ ఐదుగురు లేడీస్ గల నానీస్ గ్యాంగే చేస్తున్నట్టు అన్పించాలని, అప్పుడది పవర్ఫుల్ ఓపెనింగ్ బ్యాంగులా వుంటుందని ముసుగులేసిన ఉద్దేశమేమో? దోపిడీలో ఈ ఐదుగురూ చచ్చిపోతే బలమైన సస్పెన్స్ క్రియేటవుతుందనేమో? ఆలాంట ప్పుడా ఐదుగుర్లో ఒక చిన్న పిల్ల ముసుగు ఆకారం కూడా వుండాలి.
పెన్సిలు చెక్కుట
నానిది పెన్సిలు పార్థసారథి అనే రివెంజి నవలలు రాసే రచయిత పాత్ర. ఈ రోజుల్లో నవలా రచయితలూ, వాళ్ళ నవలలు చదివే పాఠకులూ ఎవరున్నారనే ప్రశ్నకి తగ్గట్టుగానే పెన్సిల్ రాసే నవలలు అమ్ముడుబోవు. పైగా ఇతను హాలీవుడ్ సినిమాలు కాపీ చేసి రాస్తాడు. లక్ష్మి ఒక ప్రతీకారేచ్ఛతో వున్న 80 ఏళ్ళావిడ. బ్యాంకు దోపిడీలో చనిపోయిన వాళ్ళ బంధువుల్ని కూడగట్టి, చంపిన వాడి మీద పగదీర్చుకోవాలని నానిని సంప్రదిస్తుంది. ఇది కాన్సెప్ట్ లేదా స్టోరీ ఐడియా ఏర్పాటయ్యే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.
ఇక్కడ మనం ఏ నేపథ్యం తెలిసి వున్నామంటే, ఓపెనింగ్ బ్యాంగ్ చూసిన నేపథ్యం తెలిసి వున్నాం. ఆ ఓపెనింగ్ బ్యాంగ్ క్లోజ్డ్ విండోతో వుంది. అంటే ఆ దోపిడీలో పాల్గొని చనిపోయిన ముసుగేసిన ఆకారాలు ఎవరో మనకి తెలీదు. ఇప్పుడు లక్ష్మి వచ్చి వాళ్ళు తమ ఐదుగురి బంధువులంటోంది. అంటే డెకాయిటీలు తమ బంధువులంటోందన్న మాట. అప్పటికీ ఫోటోలు చూపించి మన క్యూరియాసిటీని తీర్చలేదు. మొహాలు కూడా మనకి తెలీని వాళ్ళ హత్యలకి ప్రతీకారమంటోంది. ఎలా మనం కనెక్ట్ అవుతాం. వీళ్ళని చంపి 300 కోట్లు డబ్బుతో పారిపోయిన పెద్ద డెకాయిటీని పట్టుకుని పగదీర్చుకోవాలంటోంది.
లక్ష్మి బృందంలో నడివయసావిడ, వయసమ్మాయి, ఇంకో టీనేజీ అమ్మాయి, ఐదేళ్ళ చిన్న పిల్లా వున్నారు. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాంగ్ కొద్దిగా ఓపెనై, ఆ ముసుగు డెకాయిటీలు వీళ్ళ తాలూకు అని మనకి అర్ధమయింది. అంటే ఈ ఐదుగురు లేడీస్ మంచి ఫ్యామిలీస్ కాదనీ, డెకాయిటీ బ్యాచ్ అనీ అర్ధం వస్తోంది. ఇలా ఇప్పుడు వీళ్ళ పట్ల బ్యాడ్ ఫీలింగ్ మనకేర్పడి పోతోంది. ఇది కథకుడు ఫీల్ కాలేదా? పదుల కోట్ల బడ్జెట్ కథకి క్వాలిటీ ఇలా వుంటే సరిపోతుందా? బాక్సాఫీసు నో చెప్పే క్వాలిటీ?
ఎందుకిలా జరిగింది? కథకుడు కాన్సెప్ట్ తో కూడా సస్పెన్స్ కి పాల్పడాలనుకోవడం వల్ల. సగం కాన్సెప్ట్ చెప్పి కథ మొదలెట్టాలనుకోవడం వల్ల. ఒక ఐడియా అనుకుంటే ముందుగా అందులో కథ వుందా లేదా, ఐడియా స్ట్రక్చర్ లో వుందా లేదా చూసుకోవడం అలవాటు. లక్ష్మి వచ్చి బ్యాంకు దోపిడీలో చనిపోయిన డెకాయిటీలు మా బంధువులు, వాళ్ళని చంపిన పెద్ద డెకాయిటీ మీద పగ దీర్చుకోవాలన్నట్టు మాట్లాడుతున్నప్పుడు, ఏం కాన్సెప్ట్ ఏర్పాటయ్యింది? నెగెటివ్ క్యారెక్టర్స్ తో యాంటీ స్టోరీ ఏర్పాటయింది.
ఇక్కడ కథ నానిది. ప్లాట్ పాయింట్ వన్ అతడిది. గోల్ అతడిది. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో అతనేం గోల్ తీసుకున్నాడు? నెగెటివ్ పాత్రల పగ దీర్చే గోల్ తీసుకున్నాడు. ఇది నెగెటివ్ గోల్. ఈ నెగెటివ్ గోల్ తీసుకోవడానికి – ఈ రియల్ రివెంజిని ప్రాక్టికల్ గా చూసి నవల రాస్తే తను సక్సెస్ అవచ్చని కారణం చెప్పారు. కారణం జస్టిఫై అవచ్చు, కానీ గోల్ నెగెటివ్ గోల్. అంటే తనూ నెగెటివ్ క్యారక్టరే. దీంతో ఈ మొత్తం నెగెటివ్ క్యారక్టర్లతో ఎలా సినిమా చూపించి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనుకున్నారు?
నాని ఏమని అని వుండాలి? – ‘ఏవమ్మా, బలపంలా కన్పిస్తున్నానా? 300 కోట్ల అత్యంత భారీ దోపిడీలో మీ వాళ్ళు పార్టనర్సా? వాళ్ళని మెయిన్ డెకాయిటీ చంపి పారిపోయాడని పగదీర్చుకోవాలంటున్నారా? మీ వాళ్ళు చేసిన పనికి సిగ్గు వేయడం లేదా? మిమ్మల్ని చుట్టుపక్కలెవరూ వెలివేయలేదా? మిమ్మల్ని పోలీసులు పట్టుకెళ్ళి ఫోర్త్ ఎస్టేట్ కి తెలియకుండా థర్డ్ డిగ్రీతో చిమచిమ లాడించలేదా, మెయిన్ డెకాయిటీ ఎక్కడున్నాడో చెప్పమని? మీమీద ఇప్పుడూ పోలీసు నిఘా లేదంటావా? వెళ్ళెళ్లమ్మా, నన్నెందుకు ఇరికిస్తావు. ఈ చిన్న పిల్లకి, ఈ చదువుకునే పిల్లకీ నీ పగ ఎక్కించి పాడు చెయ్యాలా? అలాటి మీ వాళ్ళు చచ్చినందుకు సంతోషించక పగ కూడానా?’ నేను పెన్సిలునే కానీ బలపాన్ని కాను. ఈ బలపం రచయితెవరో సరీగ్గా ప్లాట్ పాయింటు రాయించుకురా, అప్పుడాలోచిద్దాం’ అనాలి గబగబా పెన్సిల్ చెక్కుతూ.
అంతా పైపైనే
ఇక నాని విలన్ (కార్తికేయ) ఆచూకీ కోసం ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటి మోరల్ ప్రెమీజ్ లేని, రసభంగమైన కథతో, నెగెటివ్ పాత్రల గోడుతో. దోపిడీ గ్యాంగ్ రిహార్సల్ చేసిన చోట చెప్పులు, టిఫిన్ బాక్సులు వగైరా చనిపోయిన దోపిడీ దార్ల వస్తువులు దొరికితే ఎవరికి మాత్రం సానుభూతి? లేడీస్ గ్యాంగ్ ఏడ్పులు ఎవరికవసరం. ఇంటర్వెల్ కల్లా విలన్ తెలిసిపోయాక వాణ్ణి చంపే ప్లాను వెయ్యక ఇంకా డొంక తిరుగుడు దేనికి. కారు రేసుల పిచ్చి గల ఆ విలన్ రేస్ ట్రాక్ కోసం, రేసు కార్ల కోసం బ్యాంకు దోచుకున్నాడు. మరి నూట యాభై కోట్లతో రేస్ ట్రాక్ నిర్మించుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? మిగిలిన 150 కోట్లు నిర్మాణం ఆగిపోయిన అపార్ట్ మెంట్లో ఫాల్స్ పిల్లర్ నిర్మించి అందులో దాచుకుని – ఏటీఎంలా దాన్ని వాడుకుంటూ వుంటే ఈ రాకపోకల్ని ఎవరూ అనుమనించరా? నాని అనుమానించి, ఆ 150 కోట్లు దోచుకుని విలన్ ని ఏడ్పించే ఆట మొదలెడతాడు. దేనికి? పగ తీర్చుకోవాలన్న కాన్సెప్ట్ ప్రకారం విలన్ ని అప్పుడే చంపేసి ఆ డబ్బు ప్రభుత్వానికి అప్పజేప్తే, విలన్ని చంపిన కేసు కూడా వుండక పోవచ్చుగా? పెన్సిల్ రైటర్ గ్లోబల్ హీరోగా పాపులర్ అవుతా డుగా, కోటి రెండు కోట్ల రివార్డు మనీతో?
ఆ 150 కోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు! దానికోసం విలన్ వచ్చేస్తే ఆ 150 కోట్లతో లక్ష్మి జంప్! ఆ డబ్బు ఏదో శరణాలయానికిచ్చేసి అక్కడ సెటిల్! పగాప్రతీకారాలేమయ్యాయో. ఇలా 150 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఎలా తిప్పుతూంటారంటే, వెచ్చాల సంచేసుకుని బజారుకెళ్ళి నట్టు. నాని సహా లక్ష్మీ, శరణాలయం బ్యాచీ ఈ డబ్బుతో క్రిమినల్స్ ఐపోయమని గుర్తించడమే లేదు. టాప్ దర్శకుడు ఎలా పడితే అలా పైపైన రాసేసి పైపైన తీసేశాడు.
అసలు విషయం
అసలు విషయాని కొద్దాం. ఇది ప్లాట్ పాయింట్ వన్ లో రావాల్సిన బేస్ పాయింట్. కథకుడి ‘సస్పెన్స్ పోషణ’ వల్ల ఎగిరి వచ్చి ఇక్కడ పడింది – సెకండాఫ్ అరగంట గడిచాక, నాని చెప్తాడు ఆ లేడీస్ కి తెలియని వాళ్ళ రహస్యమే. అసలేం జరిగిందంటే, లక్ష్మి మనవడు, నడివయసావిడ కొడుకు, వయసమ్మాయి ప్రేమికుడు, టీనేజి అమ్మాయి అన్న, చిన్నపిల్ల తండ్రి – ఈ ఐదుగురూ క్యాన్సర్ బాధితులు. ఇక చనిపోతామని తెలిసి, కుటుంబాలకి ఏదో చేయాలనుకున్నారు. విలన్ కలిసి బ్యాంక్ దోపిడీ గురించి చెప్పాడు. దాంతో అందులో తమ కొచ్చే సొమ్ముని కుటుంబాలకిచ్చేసి చనిపోవాలనుకున్నారు. కానీ విలన్ బ్యాంకుని దోచుకున్నాక వాళ్ళని చంపేశాడు. ఇదీ విషయం. ఇంత సస్పెన్స్ సెకండాఫ్ లో రివీల్ అయినందుకు మనం థ్రిల్లయి పోతాం కదా. రాంగ్. ఇది ఏడుపుగొట్టు సస్పెన్స్.
ఇంత సేపూ నాని సహా లేడీస్ ని నెగెటివ్ అర్ధంలో చూపిస్తూ సినిమాకి హాని చేశాక, ఇప్పుడు జాలి కథ చెప్తే పాజిటివ్ సెన్స్ తో ఫీలైపోతామా? జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. పైగా అసలు విషయం నాని రివీల్ చేశాకైనా లక్ష్మి సిన్సియర్ గా వుండదు. తమ ఐదుగురి కుటుంబాల కోసం క్యాన్సర్ దాచుకుని త్యాగం చేసిన వాళ్ళ పట్ల ఏ ఫీలింగ్ లేకుండా, ప్రతీకారం సంగతికి ఏవో సాకులు చెప్పి, డబ్బు కొట్టేసి శరణాలయంలో సెటిల్ అవడం. నాని నిలదీస్తే అప్పుడేమంటుంది? చనిపోయింది మనవడు కాదట, తన భర్తట! ఏమిటో తమాషాగా వున్నాయి ట్విస్టులు.
ప్లాట్ పాయింట్ ఫ్రాక్చర్
ఇదంతా కాదు, ఇక్కడ రివీల్ చేసిన విషయం ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ లోనే రావాలి. అక్కడ లక్ష్మి నాని దగ్గరికి వచ్చినప్పుడు, తమ వాళ్ళ క్యాన్సర్ గురించీ, దోపిడీతో వాళ్ళు చేసిన త్యాగం గురించీ కూడా చెప్పేసి, విజువల్స్ తో వాళ్ళని ఓపెన్ చేసి, సాయం అడగాలి. అప్పుడు సానుభూతితో వాళ్ళందరూ పాజిటివ్ క్యారక్టర్లయి కథతో బావుంటారు. ఇందుకే ఓపెనింగ్ బ్యాంగ్ లో ముసుగులు వుండకూడదనేది. చనిపోయిన వాళ్ళ నెగెటివ్ రూపాలు, ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో కనపడి, అయ్యోపాపం అనుకోవడానికి వీలుంటుంది.
ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పాల్సిన ప్రాబ్లం పూర్తిగా చెప్పకుండా సగం సస్పెన్స్ కోసమన్నట్టు దాచి, సెకండాఫ్ లో చెప్పారు. ఇలా ప్లాట్ పాయింట్ వన్ ని విరిచి రెండు ముక్కలు చేసి నష్టం చేసుకోవడం ఎక్కడా చూడలేదు. క్రియేటివ్ స్కూలుతో ఇదే ప్రాబ్లం. స్ట్రక్చర్ స్కూలు మాత్రమే స్క్రిప్టులో సమస్య లేమిటో చెప్పగలదు.
ఐతే ఈ పూర్తి ప్రాబ్లం ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పేస్తే నిర్దుష్టంగా వుంటుందా స్క్రిప్టు? మోరల్ గా వుండదు. అప్పుడూ అన్యాయంగానే వుంటాయి అన్ని పాత్రలూ చనిపోయిన వాళ్ళు సహా. ఎలా? ఎలాగేమిటి, చనిపోయిన వాళ్ళనుంచి త్యాగపు సొమ్ము రావాలే గానీ, అన్యాయపు సొమ్ము కాదు. వాళ్ళు బ్యాంకు దోపిడీ అనే నేరం చేసి కుటుంబాల కివ్వాలనుకున్నారు. అది అన్యాయపు సొమ్ము. పైగా కుటుంబాల్ని చట్టం కోరల్లో ఇరికించి నాశనం చేస్తుంది. కుటుంబాలు తిట్టిపోసుకుంటాయి.
1974 ‘మజ్బూర్’ లో, అమితాబ్ బచ్చన్ తను బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతానని తెలిసి, కుటుంబం కోసం హంతకుడి డీల్ ఒప్పుకుంటాడు. ఐదు లక్షలు తీసుకుని, హంతకుడు చేసిన హత్యని తన మీదేసుకుని, ఉరికంబం ఎక్కబోతాడు. ఇది అన్యాయపు సొమ్ము కాదు, తను నేరాలు చేయలేదు. చెయ్యని నేరాన్ని మీదేసుకున్న త్యాగపు సొమ్ము.
స్ట్రక్చర్ ఒక్కటే స్క్రీన్ ప్లే కష్టాల నుంచి విముక్తి కల్గిస్తుంది.
―సికిందర్