ఈ మధ్య బాగా వైరల్ అయిన టైటిల్ ‘ఓ బేబీ’. పాపులర్ స్టార్స్ తో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో, పాపులర్ దర్శకురాలి మేకింగ్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సోలోగా సమంత టైటిల్ రోల్ పోషిస్తూ ప్రొమోస్ లో ఒక ఆకర్షణ అయింది. పైగా ఇది కొరియన్ క్లాసిక్ అధికారిక రిమేక్ కావడంతో ఆసక్తి మరింత పెంచింది. ఇన్ని ఆసక్తులు, ఆకర్షణలతో వూరించిన ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇంతకీ ఎలా వుంది? వివరాల్లోకి వెళ్దాం…
కథ
సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి) భర్త చనిపోవడంతో కొడుకు నాని (రావు రమేష్) ని కష్టపడి పెంచి పెద్ద చేసి, ప్రొఫెసర్ ని చేస్తుంది. అదే కాలేజీలో తను క్యాంటీన్ నడుపుతూంటుంది. ఆమెకో చంటి (రాజేంద్ర ప్రసాద్) అనే చిన్ననాటి స్నేహితుడు వుంటాడు. అతడికో పెళ్ళికాని ముదిరిన కూతురు అనసూయ (సునయన) వుంటుంది. ఇంకో పెళ్ళికాని మరదలు (మేనక) వుంటుంది. లక్ష్మికి ఇంటిదగ్గర కోడలు (ప్రగతి), రాకీ అనే మనవడు (తేజ), మనవరాలూ (అనీషా దామా) వుంటారు. సంగీతం మీద ఆసక్తితో రాకీ ఒక బ్యాండ్ నిర్వహిస్తూంటాడు. ముసలి చాదస్తం కొద్దీ లక్ష్మి పెట్టే నస, ఇంటి పనుల్లో అతి జోక్యం భరించలేకపోతుంది కోడలు. ఈ టార్చర్ భరించలేక గుండె పోటుతో పడిపోతుంది. ఈమె క్షేమంగా వుండాలంటే అత్తగార్ని దూరంగా వుంచాలంటాడు డాక్టర్. ఈ విషయం తెలుసుకుని చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది సావిత్రి.
ఇక తను చస్తే తన ఫోటో బావుండాలని ఫోటో దిగడానికి ఫోటో స్టూడియో కెళ్తుంది. అక్కడొక స్వామీజీ (జగపతిబాబు) ఎదురై ఆమె చేతిలో వినాయకుడి ప్రతిమ పెడతాడు. ఆమె ఫోటో దిగగానే 70 ఏళ్ల తను, 24 ఏళ్ల యువతిగా మారిపోతుంది. ఇప్పుడేం చేసింది? ఆమె పాతికేళ్లలో 70 ఏళ్ళా విడని చూస్తున్న చుట్టూ వున్న వాళ్ళు ఎలా రియాక్టయ్యారు? ఆమె మళ్ళీ యవ్వనాన్ని ఎలా అనుభవించింది? …ఇదీ కథ.
ఎలావుంది కథ
2014 కొరియన్ క్లాసిక్ ‘మిస్ గ్రానీ’ అధికారిక రీమేక్ ఇది. ఫాంటసీ జానర్. సైకోథెరఫీ కాన్సెప్ట్. తన ధోరణి వల్ల ఇతరులు ఇబ్బంది పడుతూంటే, కుటుంబంలో తనొక ప్రశ్నగా మిగిలిపోతే, తనని తాను మార్చుకునే సైకలాజికల్ ప్రయాణమే ఈ కాన్సెప్ట్. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో టీనేజీ హీరో టైం మెషీన్ లో కాలంలో యాభై ఏళ్ళు వెనక్కి ప్రయాణించి, అక్కడ టీనేజీలో వున్న తల్లి దండ్రుల్ని కలుసుకుంటాడు. వాళ్ళ రిలేషన్ షిప్ లో అక్కడున్న లోపాల్ని సరి దిద్ది వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేస్తే ఇప్పుడు కీచులాడుకునే తల్లిదండ్రులు కలిసి మెలసి హాయిగా వుంటారు.
‘ఓ బేబీ’ లో ఈ సైకో థెరఫీయే 70 ఏళ్ల సావిత్రి పాత్ర వెనక్కి, తన యవ్వనంలోకి ప్రయాణించడంతో జరుగుతుంది. ముదిమి వయసులో తను సమస్యాత్మకంగా మారడం పడుచు వయసులో తీరని కోరికల వల్లే. తిరిగి యవ్వనాన్ని దర్శించి, ఆ తీరని కోరికలు తీర్చుకుని రావడం ద్వారా, మారిన మనిషిగా కుటుంబంలో కలిసిపోయి సుఖాంతం చేసుకో గల్గింది.
ఇలాటి కథలు గొప్ప కథల కింది కొస్తాయి. ఐతే ఈ రీమేక్ చేస్తున్నప్పుడు ఈ గొప్ప కథలో ఇమిడివున్న సైకో థెరఫీ కోణాన్ని గ్రహించారో లేదో గానీ, రిమేక్ మాత్రం ఫ్లాట్ గా వుంది. ఎక్కువగా నేటివిటీకి ఎలా మార్చుకోవాలని చేసిన ప్రయత్నంగానే కన్పిస్తుంది తప్ప, కథలో పరమార్ధాన్ని గ్రహించి ఆ మేరకు మేకింగ్ చేసినట్టు లేదు. కొరియన్ ఒరిజినల్ లో కేవలం ఫోటో స్టూడియోలో ఫోటో దిగితే యంగ్ గా మారిపోతుంది. ఆ ఫోటో స్టూడియో అనేది ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో లాగా, టైం మెషీన్ లాంటి కాలంలో వెనక్కి తీసికెళ్ళే వాహకమే. తెలుగులో రీమేక్ లో ఫోటో స్టూడియోతో బాటు, అదనంగా వినాయకుడి ప్రతిమ పెట్టారంటే ఈ కాన్సెప్ట్ ని సరిగ్గా అర్ధం చేసుకోక పోవడం వల్లే.
ఎవరెలా చేశారు
ఇది పూర్తిగా సమంతా టాలెంట్ షో. 24 ఏళ్ల వయసులో తనలో 70 ఏళ్ళా విడని మోస్తున్న ఫన్నీ పాత్రలో అద్యంతం వినోద పరుస్తుంది. చివర్లో మళ్ళీ తను 70 వ యేటకి బదిలీ అయ్యే కదిలించే సన్నివేశంలో సంభాషణల బలంతో ఎక్సెలెంట్. అల్లరి పాత్రతో చేసుకుంటూ వచ్చిన కామెడీ ముగింపులో, బరువెక్కిన పాత్రతో మొత్తం కథని సమప్ చేస్తుంది గుర్తుండి పోయే విధంగా.
సీనియర్ నటి లక్ష్మి తొలి పాతిక నిముషాలు వృద్ధురాలి పాత్రలో యూత్ కి కూడా బోరుకొట్ట కుండా నటించి మెప్పిస్తుంది. రావురమేష్, రాజేందర్ ప్రాసాద్ లిద్దరి పత్రాలు రెండు మూల స్తంభాలు. సమంతా బాయ్ ఫ్రెండ్ గా నాగశౌర్య నీటైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన పాత్రల్లో అందరూ ఓకే.
కథతో డెప్త్ విషయం అలావుంచితే, రైటింగ్ డిపార్ట్ మెంట్ క్వాలిటీతో వుంది. లక్ష్మీ భూపాల డైలాగ్స్ చాలా చోట్ల కదిలిస్తాయి. కానీ మిక్కీ జే మేయర్ సంగీతానికి న్యాయం చేయలేకపోయాడు. రిచర్డ్ ప్రసాద్ విజువల్స్ బావున్నాయి. ఇతర సాంకేతిక హంగులు రిచ్ ప్రొడక్షన్ విలువలతో వున్నాయి.
చివరికేమిటి
దర్శకురాలు నందినీ రెడ్డి నీటైన మేకింగ్ చేశారు. అయితే సుమారు మొదటి అరగంట లక్ష్మి పాత్రతో నడిపాక, ఆ తర్వాత లక్ష్మి సమంతగా మారేక – ఫస్టాఫ్ ముగించడానికి చాలా టైము తీసుకున్నారు (45 నిమిషాలు). ఈ టైములో పోనుపోను సమంతతో ఫన్ తేలిపోతూ బలహీనంగా మారసాగింది. ఎలాగో ఫస్టాఫ్ ముగించినా సెకండాఫ్ మూడ్ మార్చేశారు. బరువైన సన్నివేశాల సమాహారంగా, ఒక సెక్షన్ ఫ్యామిలీ ప్రేక్షకులకి నచ్చే కథగా నడిపేశారు. ఈ సెకండాఫ్ స్లంప్ ని ముగింపులో కథని సమప్ చేసినప్పుడే మరిపించగల్గారు. మొత్తం సమంత ఎంట్రీ దగ్గర్నుంచీ ఎగుడుదిగుడులన్నీ, ముగింపు సన్నివేశాల్లో బలమైన. అర్ధవంత మైన డ్రామా వల్ల సమం అయిపోయాయి. మొత్తానికి కథలో అంతరార్ధం పట్టుకోలేక పోయినా ఒక విజయవంతమైన ఫ్యామిలీ మూవీని అందించగల్గారు.
దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి
తారాగణం : సమంత, నాగశౌర్య, లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, తేజ సజ్జ, ప్రగతి తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల్, సంగీతం : మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్
నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్
విడుదల జులై 5, 2019
3 / 5
―సికిందర్