నటీనటులు: నితిన్, రష్మిక మందన్న, జిస్సుసేన్ గుప్తా, అనంత్‌నాగ్, వెన్నెల కిషోర్, సత్య, రాజీవ్ కనకాల, సంపత్‌రాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీతం: మహతీ స్వరసాగర్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ప్రొడక్షన్ కంపనీ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్ : 21-02-2020
రేటింగ్: 3.5
`అఆ`తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న నితిన్ ఆ విజయాన్ని కొనసాగించలేకపోయాడు. ఎంచుకున్న కథలు మంచివే అయినా వాటిని తెరపైకి తీసుకురావడంలో దర్శకులు వైఫల్యం చెందడంతో వరుస ఫ్లాపుల్ని చూడాల్సి వచ్చింది. లై, ఛల్ మోహన్‌రంగ, శ్రీనివాస కల్యాణం.. ఇలా వరుసగా మూడు ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నాడు నితిన్. కెరీర్ గాడితప్పడంతో మళ్లీ ఆలోచనలో పడ్డ నితిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే రొమాంటిక్ ఫిల్మ్ `భీష్మ`ని ఎంచుకున్నాడు. `ఛలో`తో హిట్‌ని తర ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు కావడం, టీజర్, ట్రైలర్‌లోనే సినిమా సత్తా ఏంటో తెలిసిపోవడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కు ముందు ప్రాఫిట్ ప్రాజెక్ట్‌గా సేఫ్ జోన్‌లోకి వెళ్లిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా?.. హిట్టు కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు ఆశించిన స్థాయి విజయాన్ని అందించిందా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
భీష్మ ఆర్గానిక్స్ ఫామింగ్ పేరుతో భీష్మ ( అనంత్‌నాగ్) అనే వ్యక్తి తన కంపెనీకి సరైన వారసుడి కోసం ఓ ప్రకటన చేస్తారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. జులాయిగా తిరిగే భీష్మ ప్రసాద్ (నితిన్) తనకు ఈ పేరు పెట్టడం వల్లే అమ్మాయిలు పడటం లేదని, తనకు పెళ్లి కావడం లేదని ఫీలవుతుంటాడు. అలాంటి సమయంలో అతనికి చైత్ర (రష్మిక)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. చైత్ర ఫాదర్ దేవ్ ( సంపత్‌రాజ్) పోలీస్ కమీషనర్. అతని వద్దే నితిన్ పని చేస్తుంటాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి ఆరాతీయడంతో భీష్మ ప్రసాద్ తండ్రి నరేష్ కాదని, తను భీష్మ ఆర్గానిక్స్ ఎండీ కొడుకని తెలుస్తుంది. బ్రహ్మచారి అయిన భీష్మకు భీష్మ ప్రసాద్ కొడుకు ఎలా అయ్యాడు?.. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి వెళ్లిన భీష్మ ప్రసాద్ ఏం చేశాడు? . అక్కడున్న సమస్యల్ని ఎలా పరిష్కరించాడు? చివరికి భీష్మ ఆర్గానిక్స్‌కి వారసుడయ్యాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
త్రివిక్రమ్ రూపొందించిన `అఆ` చిత్రంలో నితిన్ చాలా ప్లెజెంట్‌గా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఆ లుక్ మళ్లీ ఈ సినిమాలో కనిపించింది. నితిన్ క్యారెక్టర్‌ని మలిచిన తీరు, అతనితో డైలాగ్‌లు చెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రని నితిన్ బాగా ఆడుకుంటాడని ఈ సినిమాలో మరోసారి చూపించాడు. నటన పరంగా భీష్మ ప్రసాద్ పాత్రని రంజింపజేశాడని చెప్పొచ్చు. ఆ స్థాయిలో వెంకీ కుడుముల నితిన్ చేతి చేయించుకున్నాడు. ప్రీవియస్ చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో నితిన్ టైమింగ్ సూపర్‌గా పేలింది. రష్మికతో వచ్చే సీన్‌లలో నితిన్ అదరగొట్టేశాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆ తరువాత ఆకట్టుకుంది రష్మిక. గత చిత్రాలతో పోలిస్తే గ్లామర్ గానూ కనిపించి అలాంటి పాత్రలకు కూడా తాను రెడీ అనే సంకేతాలిచ్చింది.
`ఛలో` చిత్రంలో వెన్నెల కిషోర్ ట్రాక్‌తో నవ్వించిన వెంకీ ఈ చిత్రంలోనూ అదే స్థాయిలో అతని పాత్రని మలిచి నవ్వించాడు. కీలక పాత్రలో నటించిన అనంతనాగ్ సెటిల్డ్‌గా నటించారు. విలన్‌గా జిస్సుసేన్ గుప్తా మిగాతా పాత్రల్లో సత్య, రాజీవ్ కనకాల, సంపత్‌రాజ్, రఘుబాబు, బ్రహ్మాజీ, నరేష్‌లు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం:
`ఛలో` సినిమాతో సంగీత దర్శకుడిగా తొలి విజయాన్ని సొంతం చేసుకున్న మహతి స్వరసాగర్ ఈ సినిమాకి కూడా అదే స్థాయి సంగీతాన్ని అందించాడు. అయితే రెండు పాటలు మినహా మిగతావి సోసోగానే వున్నాయి. అయితే నేపథ్య సంగీతంతో మాత్రం సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లడని చెప్పొచ్చు. సింగల్, వాటే బ్యూటీ సాంగ్స్ మాత్రమే ఆకట్టుకునేలా వున్నాయి. ఆ తరువాత సినిమాకు ప్లస్‌గా మారిన టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్. నితిన్‌తో పాటు ప్రతీ పాత్రని, ప్రతి ఫ్రేమ్‌ని మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని స్పీడ్‌గా నడిపించాడు. ఫైట్ మాస్టర్ వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. సెకండ్ హాఫ్‌లో డిజైన్ చేసిన ఫైట్ ఎలివేషన్స్ ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ:
తొలి సినిమాకు తిన్ లైన్‌ని తీసుకుని కామెడీ ప్రధానంగా నడిపించి సక్సెస్‌ని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల ఈ సినిమా విషయంలోనూ మరో సారి దాన్నే నమ్ముకున్నాడు. తొలి హిట్‌ని అందుకున్న దర్శకుడికి ద్వితీయ విజ్ఞం అనేది సెంటిమెంట్‌గా మారింది. ఈ సినిమాతో విజయవంతంగా అదిగమించాడు. అయితే ఆర్గానిక్ ఫామింగ్‌ని అంతర్లీనంగా చెబుతూనే ప్రేమకథని నడిపించిన వెంకీ కథని మరింత బాగా రాసుకుని వుంటే ఇంకా బాగుండేది. ప్రీ క్లైమాక్స్, విలన్ పాత్రని మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తే బాగుండేది. చిన్న చిన్న మైనస్‌లు వున్నా ఓవరాల్‌గా `భీష్మ` పైసా వసూల్ మూవీ. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు లాజిక్‌లని పక్కన పెడితే కడుపు చెక్కలయ్యేలా ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ అని చెప్పొచ్చు.