నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, సుశాంత్, టాబు, జయరామ్, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, సముద్రఖని, నవదీప్, సునీల్, గోవింద్ పద్మసూర్య, రోహిణి, సచిన్‌ఖేడేకర్, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రావు రమేష్, బ్రహ్మానందం, అజయ్, చమ్మక్‌చంద్ర తదితరులు నటించారు.
కథ, దర్శకత్వం: త‌్రివిక్రమ్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 12-01-2020
రేటింగ్: 3.25
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` తరువాత అల్లు అర్జున్ సినిమా వచ్చి 18 నెలలవుతోంది. గతంలో ఇంత గ్యాప్ బన్నీకి ఎప్పుడూ రాలేదు. కథల ఎంపిక, వెళుతున్న దారిపట్ల స్పష్టత, నమ్మిన కథ ఆశించిన రిజల్ట్‌ని అందించకపోవడం, తన రెగ్యులర్ టీమ్ మారడం వంటి కారణాల వల్ల అల్లు అర్జున్ 2019లో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. 2016, 2017, 2018..ఈ మూడేళ్ల కాలంలో `సరైనోడు, డీజే దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించారు. ఈ మూడూ సీరియస్ మోడ్ సినిమాలే. దీని నుంచి రిలీఫ్ కోసం చేసిన సినిమా `అల వైకుంఠపురములో`. బన్నీ, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రమిది. గత చిత్రాలకు మించి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఓ ఫ్లాప్ తరువాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడం, సీరియస్ సినిమా `అరవిందసమేత` తరువాత త్రివిక్రమ్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ ఈ సారి ఆశించిన స్థాయిలోనే ఆకట్టుకున్నారా?. 18 నెలల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారా? అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
వాల్మీకి (మురళీశర్మ) అప్పుడే పుట్టిన తన కొడుకుని కోటీశ్వరుడైన తన బాస్ ఆనంద్ శ్రీరామ్ (జయరామ్)కి, ఆనంద్ శ్రీరామ్ కొడుకుని తనకి మార్చేసుకుంటాడు. ఈ విషయాన్ని ఓ నర్సు మాత్రమే చూస్తుంది. అయితే ఆ తరువాత జరిగిన సంఘటన కారణంగా ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. వాల్మీకి ఓ మధ్య తరగతి తండ్రి. తన బాస్ కొడుకు బంటు(అల్లు అర్జున్)నే తన కొడుకుగా పెంచుతుంటాడు. బంటు సొంత తల్లిదండ్రులు వుంటున్న `వైకుంఠపురము`(ప్యాలెస్ పేరు) వైపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటాడు. 20 ఏళ్ల తరువాత ఓ సంఘటన కారణంగా బంటుకి తన అసలు తల్లిదండ్రులెవరో తెలుస్తుంది. తెలిసిన వెంటనే బంటు వైకుంఠపురములోకి ఎంటరవ్వాలనుకుంటాడు. అక్కడ అతనికి ఎదురైన సవాళ్లేంటీ? ఇంతకీ అతన్ని తల్లిదండ్రులు నిజంగానే దూరంగా పెంచారా?, వాల్మీకి ఎందుకు బంటుని వైకుంఠపురానికి దూరంగా వుంచాల్సి వచ్చింది?. దీని వెనకున్న అసలు కథేంటి? అన్నది తెలియాలంటే `అల వైకుంఠపురములో`(థియేటర్లలో)కి ఎంటరవ్వాల్సిందే.
నటీనటులు:
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. బంటు పాత్రలో ఆల్ ఎమోషన్స్‌ని పండించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఘట్టాల్లో బన్నీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. మధ్య తరగతి తండ్రికి కొడుకుగా, మధ్యతరగతి యువకుడిగా బన్నీ నటన బాగుంది. ఇక పాటల్లో మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా కనిపించాడు. బన్నీకి నటన పరంగా `అల వైకుంఠపురములో` ఓ మంచి సినిమా అని చెప్పొచ్చు. లాంగ్ బ్రేక్ తరువాత ఈ సినిమా రూపంలో అల్లు అర్జున్‌కి టైలర్ మేడ్ పాత్ర లభించింది. దాన్ని పర్‌ఫెక్ట్‌గా తెరపై రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా బన్నీ షో అని చెప్పాలి. ఇక మధ్య తరగతి తండ్రిగా మురళీశర్మ జీవించేశారు. వాల్మీకి పాత్ర ఆయనకోసమే రాసినట్టుంది. అంతగా ఆ పాత్రలో మురళీశర్మ రాణించారనడం కరెక్ట్. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, సుశాంత్‌లకు నటించడానికి పెద్దగా స్కోప్ లభించలేదు. ఇక మిగతా కీలక పాత్రల్లో నటించిన జయరామ్, టాబు, సచిన్‌ఖేడేకర్, రోహిణి, నవదీప్, సముద్రఖని, అజయ్ పాత్రల పరిథిమేరకు అలరించారు. రాజేంద్రప్రసాద్, సునీల్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ కామెడీని పండించారు.
సాంకేతిక వర్గం:
త్రివిక్రమ్ సినిమా అంటే కేవలం మాటలే కాదు విజువల్స్ కూడా ఐ ఫీస్ట్‌గా వుంటాయి. ఈ సినిమా విషయంలోనూ ఆ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా వుంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వంటి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన సినిమా కావడంతో మనింత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీ మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. విజువల్స్ స్టన్నింగ్‌గా వున్నాయి. పారిస్‌లో తీసిన సామజవరగమన పాటలో పారిస్ అందాలు, బుట్టబొమ్మపాటలో ప్లజెంట్ సెట్ ఎట్మాస్మియర్ ఆకట్టుకుంటుంది. రిలీజ్‌కి ముందే పాటలతో ఆకట్టుకున్న తమన్ నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు. ఇప్పటి వరకు తమన్ నుంచి వచ్చిన చిత్రాల జాబితాలో ఈ ఆల్బమ్ టాప్‌లో నిలుస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ మరింత మెరుగైతే బాగుండేది. సెకండ్ హాఫ్‌లో లాగ్‌లని పట్టించుకోలేదేమో అనిపిస్తుంది.
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్‌ని తనదైన మార్కు సన్నివేశాలతో త్రివిక్రమ్ సాఫీగా సాగించారు. అయితే మళ్లీ రొటీన్ కథనే ఎంచుకోవడం, సన్నాఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది చిత్రాలని గుర్తు చేసయడం, అందులోని సీన్‌లని కొన్నింటికి రిపీట్ చేసినట్టుగా సగటు ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. `అత్తారింటికి దారేది` చిత్రంతో పవన్ అత్త కోసం ఇంటికి వస్తే..ఇక్కడ తండ్రి కోసం ఇంటిని వెతుక్కుంటూ బన్నీ రావడం, మల్టీ మిలియనీర్ అయిన తండ్రి కంపెనీలో మేజర్ షేర్ కోసం విలన్ బ్యాచ్ ప్రయత్నించడం వంటి సన్నివేశాలు గత చిత్రాలని గుర్తు చేస్తున్నాయి. ఇది ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారే అవకాశం వుంది. నరేషన్ పరంగా కూడా పాత పంథానే త్రివిక్రమ్ ఎంచుకోవడం కూడా రొటీన్‌గా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్‌లో కథాగమనం మందగించడం, కొన్ని సన్నివేశాలు డీవేట్ అవుతన్నట్టుగా వుండటం సగటు ప్రేక్షకుడికి ఎక్కవు. మల్టీప్లెక్స్ ప్రేక్షకుడిని మాత్రమే దృష్టిలో వుంచుకుని కొన్ని సన్నివేశాల్ని రాసినట్టుగా అనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్లలో చాలా వరకు బన్నీ నాన్నింటికి దారేది అంటున్నారంటే ఏ సినిమాని రిఫరెన్స్‌గా త్రివిక్రమ్ తీసుకున్నాడో అర్థమవుతోంది. అయితే తనదైన మాటలతో మాయ చేసే త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా అక్కడక్కడ తన పంచ్‌లైన్‌లతో ఆకట్టుకున్నారు, కథ రొటీన్‌గానే అనిపించినా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్‌ని మాత్రం ఆకట్టుకుంటుంది.