మంచు విష్ణు నటించిన ‘వోటర్’ అశేష ప్రజానీకం ఓట్ల పండుగ ఘనంగా జరుపుకున్నాక విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రాజకీయ గొడవలతో వున్న ఈ ట్రైలర్ ఏ పవర్ఫుల్ పాయింటూ లేకుండా లక్ష్య రహితంగా వుంది. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళి ప్రచారం చేసే ఒక అడ్వర్టైజ్ మెంట్ లా లేదు. ఇది చూసి ప్రేక్షకులు ఈ సినిమాకి ఎందు కెళ్లాలో ప్రశ్నించుకునేలా వుంది. అసలే మంచు విష్ణు సినిమాలకి ఆదరణ అంతంత మాత్రం. ఈ ట్రైలర్ చూశాక ఇక దీనికి కూడా ఓపెనింగ్స్ ఎలా వుంటాయో వూహించేయ వచ్చు.
ట్రైలర్లో రొటీన్ మూస సవాళ్లు, ప్రతి సవాళ్లు మాత్రమే వున్నాయి. మన ఓట్లతో రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కానీ ఏ ఓటరూ బాగుపడ్డం లేదు… ఒక పోలిటీషియన్ని టచ్ చేశావ్, పొలిటీషియన్ పవరేంటో చూపిస్తా…. ఆ పవర్ ఇచ్చిన ఓటర్ ని టచ్ చేశావ్, ఓటర్ పవరేంటో ఏంటో చూపిస్తా… చివరికి – రాజకీయ నాయకులకి ఓటర్ని చూస్తే ఉ….పడాలి…అంటూ ముగింపు.
ఇంతకీ పోరాటం దేనిగురించో పాయింటు లేదు. సినిమాలో పాయింటు వుంటే దాన్ని ట్రైలర్ లో హైలైట్ చేయకపోవడం ట్రైలర్ కి మైనస్. ‘నిన్ను నువ్వు నమ్మితే మాత్రం మార్పు తీసుకు రావచ్చు’ అని నాజర్ డైలాగుతో కూడా దేని గురించి మార్పో చెప్పలేదు. బుల్లెట్ పాయింటు లేకుండా నిస్తేజంగా, లక్ష్య రహితంగా వున్న ఈ ట్రైలర్ లో రొటీన్ సవాళ్లు, ప్రజా సమూహాలు, పోరాటాలు మాత్రమే వున్నాయి. ఓటర్ గా విష్ణు, అతడి లవర్ గా సురభి, రాజకీయ నాయకులుగా సంపత్ రాజ్, పోసానీలు వున్నారు.
జీఎస్ కార్తీక్ రచన, దర్శకత్వంలో తమన్ సంగీతం సమకూర్చిన ఈ రాజకీయ సినిమా నిర్మాత జాన్ సుధీర్ పూదోట. ఈ నెల 21 న విడుదలవుతోంది.