హాస్యభరితంగా సాగిన ‘ప్రేమలు’!

మలయాళంలో కేవలం మూడు కోట్ల బడ్జెట్‌ తో తీసిన ‘ప్రేమలు’ అనే సినిమా అక్కడ వంద కోట్లు కలెక్టు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు. దీనికి దర్శకుడు గిరీష్‌ ఎడి. మలయాళం సినిమా నిర్మాతల్లో ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కూడా ఉండటం ఆసక్తికరం. యువతని బాగా ఆకర్షించే చిత్రంగా మలయాళంలో నిలిచింది. ఈ సినిమా షూటింగ్‌ చాలావరకు హైదరాబాదులో జరిగింది, అక్కడ సంచలనం సృష్టించిన సినిమా తెలుగులో విడుదలయి పాజిటివ్‌గా దూసుకెళ్తోంది.

సచిన్‌ (నస్లీన్‌ కె గఫూర్‌) కేరళలో ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తాడు, పై చదువులకోసం యూకే వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు, అప్లై చేస్తాడు, కానీ వీసా రాదు. ఇంట్లో అమ్మ, నాన్నలు మాట్లాడుకోరు, పోట్లాడుకుంటూ వుంటారు, బేకరీ వ్యాపారం కూడా సచిన్‌ కి బోర్‌ కొడుతుంది. తన స్నేహితుడు అమూల్‌ (సంగీత్‌ ప్రతాప్‌) సలహాతో, అతనితో పాటు సచిన్‌ హైదరాబాదు వచ్చేస్తాడు. ఇక్కడ గేట్‌ పరీక్షలకి ప్రిపేర్‌ అవటానికి తర్ఫీదు తీసుకుంటూ ఉంటాడు. ఇక్క రీను (మమిత బైజు) అనే సాప్ట్‌ వేర్‌ లో పనిచేసే అమ్మాయితో పరిచయం అవుతుంది, ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు, కానీ ఆమెతో మాత్రం చెప్పడు. రీను ఆఫీసులో సీనియర్‌ ఉద్యోగి అయిన ఆది (శ్యామ్‌ మోహన్‌) కి రీను అంటే ఇష్టం, ఆమెని ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు.

డబ్బులు సరిపోక సచిన్‌ హైదరాబాదులో ఒక బేకరీలో వుద్యోగంలో చేరతాడు. ఇక ఇక్కడ నుండి సచిన్‌ తన ప్రేమ వ్యవహారం రీనుకు చెప్పాడా, ఆమె దానికి సమాధానం ఏమని చెప్పింది? రీను ఆఫీసులో తనకి చాలా దగ్గరగా ఉండటం చూసిన ఆది కూడా రీనుకి పెళ్లి గురించి ప్రస్తావిస్తే అతనికి ఏమి సమాధానం చెప్పింది? ఈ ప్రేమ వ్యవహారాల్లో అమూల్‌, కార్తీక పాత్రలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘ప్రేమలు’ సినిమా చూడాల్సిందే! యువత, వారిమధ్య నడిచే చిన్న చిన్న ప్రేమకథలు, చిలిపి తగాదాలు, వినోదాత్మక సన్నివేశాలు, సంభాషణలతో ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా రాస్తే అవి విజయవంతం అవుతాయి అనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ప్రేమలు’.

ఇది మలయాళంలో సంచలనం సృష్టించింది. దర్శకుడు గిరీష్‌ ఎడి కేవలం ప్రేక్షకులను బాగా ఎంటర్‌ టైన్‌ చెయ్యడం కోసమే ఈ వినోదాత్మకమైన కథని రాసుకొని సినిమాగా చిత్రీకరించినట్టు అర్ధం అవుతుంది. పాండెమిక్‌ వచ్చిన దగ్గరనుండీ మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూడటం మొదలెట్టారు, అందుకని మలయాళం సినిమా వస్తోంది అంటే తెలుగు ప్రేక్షకులకి కూడా ఆసక్తి పెరిగింది. ‘ప్రేమలు’ ఒక గొప్ప కథతో తీసిన సినిమా అని చెప్పలేము, కానీ తెలిసిన, చూసిన కథనే ఇప్పుడున్న యువకులు ఎలా ప్రవర్తిస్తారు, మాట్లాడుకుంటారు, వారిమధ్య వచ్చే సంభాషణలు ఇవన్నీ దర్శకుడు చాలా తెలివిగా చూపించాడు. అయితే ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా ఉండేట్టు రాసుకున్నాడు.

సాప్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగులు ఎలా వుంటారు, సీనియర్స్‌ ఎలా ప్రవర్తిస్తారు, అవన్నీ బాగా చూపించాడు, దానికితోడు ఇందులో నటీనటులు ఆ పాత్రకి సరిపోయేట్టుగా నటించడం ఈ సినిమా విజయానికి కారణం అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూనే వుంటారు. సినిమా అంతా యువత నేపథ్యంలో తీసి, వాళ్లనే టార్గెట్‌ చేసినా, అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.

క్లైమాక్స్‌ ఏవిూ గొప్పగా ఉండదు, అందరూ ఊహించినట్టుగానే ఉంటుంది. హైదరాబాదులో ప్రదేశాలను మలయాళం చిత్ర నిర్వాహకులు ఇంత చక్కగా చూపిస్తుంటే, మన తెలుగు వాళ్ళు మనదగ్గరే ఇంత మంచి ప్రదేశాలను పెట్టుకొని చిత్రీకరణ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి చెయ్యడం విచారకరం.సంగీతం బాగుంది. చివరగా, ‘ప్రేమలు’ సినిమా యువత నేపథ్యంలో వచ్చిన కథే అయినా, కుటుంబంతో సహా అందరూ చూడగలిగిన సినిమా. మొదటి నుండి చివరి వరకూ వినోదాత్మకంగా ప్రతి సన్నివేశంలోనూ నవ్వులు పండిరచే సినిమా ఇది. హాయిగా నవ్వుకోవచ్చు. తెలుగులో మాటలు రాసిన ఆదిత్యకి తెలుగు విజయంలో చాలావరకు క్రెడిట్‌ వెళుతుంది.