దిల్ రాజు vs నైజాం డిస్ట్రిబ్యూటర్ – అసలేం జరిగింది ఎందుకు జరిగింది ?

దిల్ రాజు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అన్న సంగతి తెలిసిందే. మొదట డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారి లక్కీ హ్యాండ్ అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఎవరైనా కొత్త హీరోని లాంచ్ చేయాలంటే దిల్ రాజు బ్యానర్ ద్వారానే లాంచ్ చేయాలని భావిస్తుంటారు. ఇక దిల్ రాజు కాంపౌండ్ లో దర్శక, రచయితలు ఎంతో మంది ఉన్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి పరిచయమైన దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా టాలీవుడ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతేకాదు కొత్త వాళ్ళకి దిల్ రాజు ప్రొడక్షన్స్ మంచి ప్లాట్ ఫాం అని ఇప్పటికే పలువురు చెప్పిన సందర్భాలున్నాయి.

ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న చాలామంది దిల్ రాజు దగ్గరకే వస్తుంటారు. కథ బావుంటే బయట సినిమాలను తన బ్యానర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇక నిర్మాతగా తన డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్ద భరోసాగా నిలుస్తున్నాడు. చిన్న హీరో నుంచి ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల వరకు అందరితో సినిమాలు నిర్మించే సత్తా ఉన్న నిర్మాత. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇంత పేరున్న దిల్ రాజు ఈ మధ్య కాంట్రవర్సీలకి కారణం అవుతున్నాడు. ఈ మధ్య వరంగల్ శీను .. దిల్ రాజుని .. శిరీష్ ని బాగానే ఏకేశాడు.

కాగా మరొక సారి ఇలాంటి వ్యవహారమే తెరమీదకి వచ్చింది. మల్టీప్లెక్స్ స్క్రీన్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లను పర్సంటేజీ విధానంలో నడిపించేందుకు ఉద్యమం మొదలైంది. అయితే ఇందుకు కొంతమంది ఎస్ అంటుంటుంటే కొంతమంది నో అంటున్నారు. దిల్ రాజు- శిరీష్ వర్గాలు వ్యతిరేకిస్తుంటే..సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు లాంటి బిజినెస్ మేన్ మాత్రం ప్రోత్సహించడం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు వర్సెస్ సురేష్ బాబు వర్గాలు ఎవరికి వారు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఇరు వర్గాల మధ్య వార్ దేనికి దారి తీస్తోందో అంటూ ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ నెల వరసగా పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది.