Son Of India: మోహన్ బాబు సినిమా వైఫల్యానికి కారణాలు… ఇవేనా .. ?

Son Of India: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో ఆయన సినిమాలు చూసేందుకు అభిమానులు తెగ ఆరాట పడిపోయేవారు. ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన మోహన్ బాబు… తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండరీ నటుల్లో ఒకరిగా నిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రతిభాశాలినో. అంత గొప్ప నటుడు ఇటీవల తీసిన ఓ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లేవంటూ మీమ్స్, ట్రోల్స్‌ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా బుకింగ్స్ మీద వస్తున్న విమర్శలు చూసి ఆయన ఫ్యాన్స్ చలించిపోయారు.

ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఎలా ఉంది? అనే విషయానికొస్తే నటప్రపూర్ణ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో నటించిన సినిమా సన్‌ ఆఫ్ ఇండియా. వెరైటీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 350 థియేటర్లలో ప్రదర్శించినా మోహన్ బాబు అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇప్పటి జనరేషన్‌ను చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున ఆకట్టుకున్నట్టు మోహన్ బాబు ఆకట్టుకోకపోవడమే ఈ చిత్ర తిరస్కరణకు ముఖ్య కారణంగా తోస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మహానటి, ఆకాశమే హద్దురా వంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నా.. సన్‌ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల పల్స్‌ను పట్టుకోలేకపోయారనే వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ చిత్రానికి ముందు నుంచే సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివ్ ప్రచారం కూడా ఈ సినిమా వైఫల్యానికి కారణమని రాష్ట్ర మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి అన్నారు. ఈ ప్రచారం ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిపైనా పడిందని, ప్రతి ఒక్కరూ చాలా నష్టపోయారని ఆయన వాపోయారు. అలా ట్రోల్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని మోహన్ బాబు ఇప్పటికే ప్రకటించారని ఆయన మరోసారి గుర్తు చేశారు.

కాగా ఈ సినిమాపై మోహన్ బాబు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, అందుకే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఈ చిత్రం నెగెటివిటీకి కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో కాకుండా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుండేదేమోనని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఆయన వెన్నంటి ఉండే స్నేహితులు, అభిమానులు మాత్రం ఆయనకు సంపూర్ణ మద్దతునిస్తూ, ఆయనకున్న టాలెంట్‌ను కీర్తిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు.