దర్శకధీరుడు రాజమౌళి అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా అతని స్నేహితుడిగా చెప్పుకునే శ్రీనివాసరావు చేసిన సంచలన ఆరోపణలు ఊహించని స్థాయిలో చర్చకు దారితీశాయి. అయితే ఇలాంటి సమస్యలపై సాధారణంగా సెలబ్రిటీలు స్పందిస్తారు కానీ రాజమౌళి మాత్రం పూర్తిగా మౌనం పాటించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
శ్రీనివాసరావు ఆరోపణలు మరీ చిన్నవి కావు. ఆయన తాను రాజమౌళి వల్ల మానసికంగా కుంగిపోయానని, చివరికి తన మరణానికి కూడా ఇదే కారణమని చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. పైగా, రాజమౌళిపై లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం వ్యవహారాన్ని మరింత సీరియస్ చేసింది. అయినా రాజమౌళి మాత్రం ఇప్పటికీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి ఆరోపణలపై తక్షణమే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ జక్కన్న మాత్రం ఈ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం సినిమావర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది.
ఇంతకు రాజమౌళి ఈ వివాదాన్ని పట్టించుకోకూడదని భావిస్తున్నారా? లేక ఇందులో మాట్లాడితే అనవసరంగా మరింత హైలైట్ అవుతుందని ఆయన లాయర్లు, కుటుంబ సభ్యులు సూచించారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ అయితే రాజమౌళికి ఈ ఆరోపణల గురించి తెలియకపోవచ్చని అంటున్నారు. కానీ సామాజిక మాధ్యమాల ప్రభావం ఉన్న ఈ రోజుల్లో ఒక పెద్ద వివాదం మీద ఆయనకు సమాచారం తెలియదు అనడం అసంభవమే.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఆయనకు ఇప్పుడు ఈ వివాదంపై స్పందించడం వల్ల మైనస్ అవుతుందనే అభిప్రాయంతో మౌనం పాటిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే సినీ వర్గాల్లో మాత్రం రాజమౌళి కనీసం లీగల్ నోటీసైనా పంపించి వివాదాన్ని క్లియర్ చేసుకుంటే బెటర్ అయ్యేది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి జక్కన్న ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.