అమెరికాలో మెగాస్టార్ కు సత్కారం!

మెగా స్టార్‌ చిరంజీవికి భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్‌’ ఇచ్చి సత్కరించింది. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు తరువాత పద్మ విభూషణ్‌ దక్కించుకున్నది ఒక్క చిరంజీవి మాత్రమే. ఇంతకు ముందు అంటే 2006 లో చిరంజీవికి అప్పటి భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ ఇచ్చి సత్కరిస్తే, ఇప్పుడు 18 సంవత్సరాల తరువాత పద్మ విభూషణ్‌ వచ్చింది.

ఈ అవార్డు అధికారికంగా ప్రకటించిన తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, నిర్మాతలు, సాంకేంతిక నిపుణులు చిరంజీవి ఇంటికి వెళ్లి అతన్ని అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం పద్మ అవార్డు గ్రహీతలు అందరికీ సన్మానం జరిపింది. అప్పుడు చిరంజీవికి కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

చిరంజీవి ఇప్పుడు అమెరికా పర్యటన కోసమై తన భార్య సురేఖతో వెళ్లారు. అక్కడ పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ ప్రతినిధి, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చిరంజీవిని కలిశారు. అక్కడ చిరంజీవికి ఒక చిరు సన్మానం చెయ్యాలని నిశ్చయించుకున్నారని తెలిసింది.

చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇప్పుడు అమెరికాలో చిరంజీవికి పద్మవిభూషణ్‌ వచ్చిన సందర్భంగా విశ్వప్రసాద్‌ ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది.