టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ప్రస్తుతం ‘ఓరి దేవుడా ‘ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. తమిళ్ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడువలే సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు.
ఇక తమిళ్ భాషలో దర్శకత్వం వహించిన అశ్వత్ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో టాలివుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించాడు. అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అందువల్ల గురువారం హైదరాబాదులో సినిమా యూనిట్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా ఈ సినిమా తనకి హిట్ ఇస్తుందని చాలా నమ్మకంగా ఉన్నట్లు వెల్లడించాడు.
ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా … వెంకటేష్ గారితో కలసి చేసిన ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అని విలేకరి ప్రశ్నించగా… విశ్వక్ సేన్ స్పందిస్తూ…ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. సెట్లో మూడు రోజులు ఆయనతో కలిసి ప్రయాణం చేశా. ఈ సినిమాలో ఆయన లుక్, పాత్రలో ఆయన ఉత్సాహం చాలా బాగుంటుంది. షూటింగ్ సమయంలో షాట్ విరామంలో ఇతరులతో కబుర్లు చెబుతూ గడపకుండా సీన్ ఎలా ప్రాక్టీస్ చేయాలో అన్న విషయం ఆయన్ని చూసి నేర్చుకున్నా. మన పని మనం చేస్తూ వెళ్లినప్పుడు గొప్ప సినిమాలు మనల్ని వెదుక్కుంటూ వస్తాయి అని ఆయన చెప్పిన మాటలు జీవితాంతం నాకు గుర్తుంటాయి ” అంటూ చెప్పుకొచ్చాడు.