విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ ద్వారా విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమయ్యారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా తిరుపతి వెళ్లిన విశ్వక్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”చాలా రిస్క్ చేసి గామి సినిమా తీశాం. ఇది కమర్షియల్‌గా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఆరేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. మా సినిమా నలుగురు పెద్ద మనుషులు చూసి.. మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతాను.
మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెబుతోన్న మాటలు కావు. సినిమా రిలీజైన నాలుగు రోజులకు చెబుతున్నానంటే నాకెంత నమ్మకముందో అర్థం చేసుకోవాలి. కొందరు కావాలనే నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. వారి గురించి పట్టించుకునేంత సమయం నాకు లేదు” అన్నారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు విశ్వక్ ధన్యవాదాలు చెప్పారు.
ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో ఇది రానుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, వినోదం నిండిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఆయన పూర్తి మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. నేహాశెట్టి హీరోయిన్‌గా అలరించనున్నారు. ఇప్పటికే పాటలకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.