కంటెంట్ తో మ్యాజిక్ చేస్తున్న విరూపాక్ష..!

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో హిట్ల కంటే ఫట్లే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మార్చి నెలాఖర్లో దసరా సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీసు చాచా డల్ గా నడుస్తోంది. రావణాసుర, మీటర్, శాకుంతలం వంటి సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. రావణాసుర చిత్రానికి ఓ మోస్తారు ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ మిగతా చిత్రాలకు అయితే ఆ భాగ్యం కూడా దక్కలేదు.

సినిమాలకు బాగా కలిసి వచ్చే వేసవి సీజన్ లో చిత్రాలు పెద్దగా ఆడకపోవడం ఏంటని అంతా కంగారు పడిపోయారు. కానీ శుక్రవారం రోజు విడుదల అయిన విరూపాక్ష సినిమాకు కూడా ముందు అంత హైప్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా థ్రిల్లింగ్ గా ఉండడంతో చాలా మంది సినిమా కోసం ఎగ్జైట్ అయ్యారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా డల్ గానే నడిచాయి.

ఒకప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమా వస్తోందంటే చాలు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకునే వారు. మొదటి రోజు కచ్చితంగా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశేవారు. కానీ విరూపాక్షకు మాత్రం ఆ పరిస్థితి లేదు. శుక్రవారం రోజు షోలకు ఆక్యుపెన్సీ తక్కువగా కనిపించింది. అయితే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీసు దగ్గర విరూపాక్ష మ్యాజిక్ మొదలైంది.

పాజిటివ్ టాక్, పాజిటివ్ రీవ్యూలు రావడంతో సినిమా చూసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పొద్దునతో పోలిస్తే సాయంత్రానికి విపరీతంగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావరేజ్ అంటే ఆలోచిస్తారు కానీ అందరూ బాగుందంటే ప్రేక్షకులు ఎగబడతారు.

అందులోనూ కొన్ని వారాలుగా సరైన సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష వైపు మళ్లడానికి దోహద పడుతుంది. తేజ మీద సానుభూతి, సానుకూలత ఉండడం కూడా సినిమాకు బాగా కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు. శని, ఆది వారాల్లో సినిమాకు మరింత మంచి వసూళ్లు వస్తాయని అర్థం అవుతోంది. నూతన దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అతడి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.