టెస్ట్ క్రికెట్‌పై విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం టీమ్‌ఇండియా అభిమానుల గుండెను పిండేస్తోంది. గత రెండు వారాలుగా ఆయన టెస్ట్ నుంచి రిటైర్ అవుతారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు అది నిజమవుతుందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. బీసీసీఐ కూడా ఈ పరిణామాలను ఎంతో సీరియస్‌గా తీసుకుని ఆయనను ఆపే ప్రయత్నంలో పడింది.
భారత జట్టు, ముఖ్యంగా యువ క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై ఎలా ఆడాలో కోహ్లీ నుంచి నేర్చుకుంటారు. ఈ తరుణంలో అతడు టెస్ట్‌కి గుడ్‌బై చెప్పడం జట్టుకే కాదు, భారత క్రికెట్‌కు నష్టమే అవుతుంది. అందుకే బీసీసీఐ టీమ్ లో అత్యున్నత స్థాయి వ్యక్తిని కోహ్లీతో మాట్లాడించేందుకు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో కోహ్లీని కూడా కోల్పోతే అనుభవ లోటు స్పష్టంగా కనిపించే అవకాశముంది.
ప్రస్తుతానికి కోహ్లీ ఈ విషయమై అధికారికంగా స్పందించలేదు. కానీ ఆయన నిర్ణయం ఫిక్స్ అయిందన్న సంకేతాలు బీసీసీఐ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. కోహ్లీ ఏ నిర్ణయం తీసుకున్నా, అది జట్టు సమగ్రతకు హానికరం కాకూడదని బోర్డు భావిస్తోంది.
ఇదిలా ఉండగా, 123 టెస్టుల్లో 9,230 పరుగులు, 29 సెంచరీలు సాధించిన కోహ్లీకి టెస్ట్ క్రికెట్‌లో ఉన్న గౌరవం అంతాస్తాయి. ఒక్క మ్యాచ్‌ను కోహ్లీ ఆడినా, అతడి ఫెయిల్యూర్ కన్నా ఫైటింగ్ స్పిరిట్‌కు అభిమానుల అభిమానం ఎక్కువ. ఇలాంటి ప్లేయర్‌ను ఎలాగైనా బీసీసీఐ నిలబెట్టుకోవాలని చూస్తుండటంలో ఆశ్చర్యం లేదుగానీ… కోహ్లీ చివరి నిర్ణయం కోసం మాత్రం క్రికెట్ ప్రపంచం వెయ్యికళ్లతో ఎదురు చూస్తోంది.