టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ చేసిన ప్రకటన అభిమానులను మాత్రమే కాదు, బీసీసీఐని కూడా షాక్‌కు గురిచేసింది. గత కొంతకాలంగా కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఉన్నప్పటికీ, అతని నిర్ణయం ఇలా సడెన్‌గా రావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ఆపేందుకు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
కోహ్లీని రిటైర్మెంట్ తీసుకోకుండా ఉంచేందుకు బోర్డు ప్రత్యేకంగా సీనియర్ సభ్యులను రంగంలోకి దించింది. కానీ విరాట్ తాను తీసుకున్న నిర్ణయంలో స్ట్రాంగ్ గా నిలిచాడు. కుటుంబానికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతనికి సమీపవర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు పిల్లల తండ్రిగా, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకున్నాడట.
విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లలో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్ట్ బ్యాటింగ్ సగటు 49.29గా ఉండగా, 7 డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. 2014లో ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయడం ద్వారా తన క్లాస్‌ను చాటాడు. 2016లో కెప్టెన్‌గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన రికార్డు సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.
మిడ్ ఆర్డర్‌లో నిలకడగా ఆడుతూ భారత్‌కు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన విరాట్, విదేశాల్లో సాధించిన సెంచరీలతో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నాడు. ఇక ఈ క్రమంలో రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో టెస్టు నుంచి వైదొలగడం భారత జట్టుకు గట్టి దెబ్బ. టెస్టుల్లో అనుభవం కలిగిన ప్లేయర్లు అరుదుగా దొరకడమే కాకుండా, కీలక మ్యాచ్‌లలో వారిని భర్తీ చేయడం పెద్ద సవాలే.