దటీజ్.. విజయ్‌ దేవరకొండ!

విజయ్‌ దేవరకొండ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది. ఐదేళ్ల తర్వాత విజయ్‌ దేవరకొండకు మళ్లీ సూపర్‌ హిట్‌ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. ‘లైగర్‌’ డిజాస్టర్‌ తర్వాత మంచి సక్సెస్‌ అందుకోవడంతో విజయ్‌ దేవరకొండ ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో విజయ్‌ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించినయమొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఖుషి ప్రొమోషనల్‌ ఈవెంట్‌లో విజయ్‌ మాట్లాడుతూ.. ‘ఖుషి చిత్రం ఇవాళ ఫేక్‌ రివ్యూలను, తప్పుడు ప్రచారాలను అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులే. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు.

కానీ, అభిమానుల ప్రేమ ముందు అవేవీ పనిచేయలేదు. అభిమానుల ముఖాల్లో ఆనందం చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో పంచుకోవాలని ఉంది కానీ, అది సాధ్యం పడదు. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటాను. కానీ, ఇప్పటి నుంచి మీ ( ఫ్యాన్స్‌) అందరి కోసం పనిచేయాలనుకుంటున్నాను. మీరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనమంతా ఓ ఫ్యామిలీ. అందుకే నా విజయం, సంతోషంతోపాటు నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఖుషి చిత్రం ద్వారా నేను సంపాదించిన మొత్తంలో ఒక రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఓ వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తాను’ అని విజయ్‌ దేవరకొండ వెల్లడించారు.