విభిన్నమైన పాత్రలు చేయాలన్నా కొత్త తరహా కథలలో నటించాలన్న ఆసక్తి చూపించాలన్నా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ముందుంటాడు. అందుకే లగాన్, దంగల్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి సినిమాలొచ్చాయి. అలాంటి హీరో టలీవుడ్ లోనూ ఉన్నాడు. ఆయనే వెంకటేష్. కెరీర్ ప్రారంభం నుంచి వెంకటేష్ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించాడు. ధర్మ చక్రం, రాజా, క్షణ క్షణం లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు చంటి, గురు లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేశాడు.
ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికి వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాత్రం దూరం వెళ్ళలేదు. కాగా వెంకటేష్ కెరీర్ లో ‘సుందరాకాండ’ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ గా నటించాడు. అయితే మరోసారి అలాంటి పాత్ర చేయబోతున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ నారప్ప సినిమాలో నటిస్తున్న వెంకీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.
సమ్మర్ వరకు ఎఫ్ 3 కంప్లీట్ చేసి సమ్మర్ నుంచి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడని తెలుస్తుంది. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డిలే అయింది. కాగా ఈ సినిమా గుర్రపు పందేలు బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతుందని అంటున్నారు.
ఈ సినిమాలోనే వెంకీ మరోసారి లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. లెక్చరర్ కి గుర్రపు పందేల వ్యవహారాని సంబంధం ఎంటన్నది అసలు కథలో కీలకమైన పాయింట్ అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించనున్నారని సమాచారం.