‘ఛావా(Chhaava)’.. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన హిస్టారికల్ యాక్షన్ మూవీ ఛావా. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.హాలిడే , వర్కింగ్ డే అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ( Lakshman Utkar) దర్శకత్వం వహించిన ఈ సినిమా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు.. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్న ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కేజీల బరువు పెరిగి మరీ సాహసం చేశారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి విడుదలైన “ఆయా రే తూఫాన్” పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. మరి ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఈమె ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ పాటలు పాడారు. అయితే ఈసారి ఈమె ఆయా రే తుఫాన్ అనే పాటను ఆలపించి ఊహించని పాపులారిటీ దక్కించుకుంది.
ఇక ఈ పాటను ఏ. ఆర్.రెహమాన్ (AR Rahman)స్వరపరిచారు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే .. ఈ పాట పాడే సువర్ణ అవకాశం గాయని వైశాలి సామంత్ కి లభించడమే. ఏఆర్ రెహమాన్ స్వరం అద్భుతంగా ఉంటుంది. వైశాలి తన వాయిస్ తో భావోద్వేగాన్ని మరింత పెంచింది .ఈ పాట విన్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ పాట చిత్రం నుండి విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ పాట చూస్తుంటే ఛాతి గర్వంతో నిండిపోతుంది.
ఇక ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ..” ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఈ పాట అటు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్ తో ప్రత్యక్ష ప్రసారం చేయడం నాకు ఒక గొప్ప అవకాశం.ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అంటూ వైశాలి తెలిపింది. మొత్తానికి అయితే వైశాలి ఈ పాటతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. అందులోనూ సంగీత దిగ్గజ దర్శకుడు, రెండు సార్లు ఆస్కార్ సొంతం చేసుకున్న రెహమాన్ తో పాట పాడే అవకాశం అంటే ఇక ఆమె జీవితం ధన్యమైందని అటు అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.