మొదటి సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు.. ఆమె నటన ఎలా ఉంటుంది.. ఏ మేరకు పాత్రను మోయగలదు ఇలాంటి విషయాలేవీ తెలియదు. నటిగా నిరూపించుకోనూ కూడా లేదు. కానీ రేటు మాత్రం ఆకాశమంత ఎత్తులో కోట్ చేస్తుందట. ఇదంతా ఉప్పెన భామ కృతిశెట్టి గురించే. ఉప్పెన సినిమాలు కనుబొమ్మలు ఎగిరేసి, అలా చిరు మందహాసాన్ని చూపెట్టి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. లిరికల్ వీడియోలో మాత్రమే కృతిశెట్టి కనిపించి ఈ రేంజ్‌లో ఫేమస్ అయింది.
ఉప్పెన సినిమా రిలీజ్ అయితే కృతి శెట్టి భవితవ్యం ఏంటో తెలిసిపోతోంది. కానీ ఉప్పెన ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియకుండా ఉంది. డిసెంబర్‌లో సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుస్తారని సమాచారం. చాలా సినిమాలు డిసెంబర్‌లో వచ్చేందుకు క్యూ కట్టాయి. అందులో ఉప్పెన కూడా ఉండే చాన్స్ ఉంది. అయితే మొదటి సినిమానే ఇంకా పూర్తి కాలేదు కానీ నిర్మాతలు మాత్రం ఆమె కోసం క్యూ కట్టారు. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్‌లు ఓకే అయ్యాయి.
నాని సరసన శ్యామ్ సింఘరాయ్, సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ మూడో సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే కృతి శెట్టి మాత్రం ఈ సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ కోట్ చేసిందట. డెబ్బై లక్షలు ఇస్తేగానీ నటించనని చెప్పిందట. వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే గానీ ఆ రేంజ్ రెమ్యూనరేషన్‌కు అంత ఈజీగా చేరుకోరు. కానీ కృతి మాత్రం మొదటి సినిమా విడుదల కాకముందే అంత మొత్తంలో డిమాండ్ చేస్తోందట. ఆశ్చర్యకరంగా నిర్మాతలు కూడా కృతి చెప్పిన రేటుకు తలూపుతున్నారట.