ప్రతి సంక్రాంతి పండుగ సినీ పరిశ్రమలో చాలా ముఖ్యమైనది. ఆ రోజునే చాలామంది నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసి తమ తమ అదృష్టాలను పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2024 సంక్రాంతికి కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ సినిమాల వరకు విడుదలకు సిద్ధమయ్యాయి. మళ్లీ ఇందులోనూ అందరూ పెద్ద స్టార్లు, బడా సంస్థల నుంచి భారీ బడ్జెట్‌తో వస్తున్నవే కావడం విశేషం. ముఖ్యంగా మహేశ్‌బాబు గుంటూరుకారం, రజనీకాంత్ లాల్ సలామ్, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ హనుమాన్, సుందర్ సీ అరణ్మై4 ,శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, విజయ్ సేతుపతి హ్యాపీ క్రిస్మస్ వంటి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు.
అయితే ఎన్నడూ లేని విధంగా 10,12 సినిమాలు పొంగల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుండడంతో మేకర్స్, సినీ అభిమానుల్లో కాస్త కలవరం మొదలైంది. ఇన్ని సినిమాలు విడుదలైతే వాటికి థియేటర్లు దొరకడం, కలెక్షన్లు రావడం చాలా కష్టం అయ్యే పరిస్థితులు ఉండడంతో ఈ రేసులో నుంచి ఎవరైనా తప్పుకుంటారా లేదా అనే చర్చలు మొదలయ్యాయి. ఇందులో ఈగల్, హనుమాన్ సినిమాలు వాయిదా వేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా సదరు నిర్మాతలు ఖండించి మేము వెనకడుగు వేసేదే లేదని.. సినిమాను తప్పకుండా విడుదల చేస్తామంటూ ప్రకటించారు.
నా సామిరంగ విషయం తెలియాల్సి ఉంది. ఈక్రమంలో తాజాగా దిల్ రాజు నిర్మాతగా పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,, మృణాల్ జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఇంకా చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉండడం, అమెరికా వీసా సమస్యలు ఎదురవడంతో ఈ చిత్రాన్ని ఫిభ్రవరి18న రిలీజ్ చేయాలని చూస్తూన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లైగర్ దారుణమైన ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న అభిమానులకు ఇప్పుడు సినిమా వాయిదా పడడం మింగుడు పడడం లేదు.