టాక్సీ సేవలందించే ప్రపంచ ప్రసిద్ధి సంస్థ ఉబెర్, ఇప్పుడు ప్రయాణ అనుభవాన్ని ఇంకాస్త మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కారు, ఆటో, బైక్ లతో పరిమితమైన సేవలు అందించిన ఉబెర్… తాజాగా ‘హెలికాప్టర్’ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటలీలోని అమాల్ఫీ కోస్ట్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా ఈ ప్రత్యేక సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా సేవలను విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ నూతన ఆవిష్కరణగా ఉబెర్ భావిస్తోంది.
‘ఉబెర్ కాప్టర్’ పేరుతో ఈ ప్రత్యేక హెలికాప్టర్ సేవలు జూలై 26 నుంచి ఆగస్టు 23 వరకు సోరెంటో, కాప్రి పట్టణాల మధ్య అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ సేవలను కనీసం 48 గంటల ముందుగా ఉబెర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ ప్రయాణాలు శని, ఆదివారాల్లో మాత్రమే లభిస్తాయి. ఉదయం 9 గంటలకు సోరెంటో నుంచి బయలుదేరే హెలికాప్టర్, సాయంత్రం 5 గంటలకు తిరిగి కాప్రి నుంచి వస్తుంది. ఒకేసారి ఆరుగురు ప్రయాణించేందుకు వీలైన ఈ రైడ్ కోసం రూ. 24,450 (250 యూరోలు) చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీ లోపలే హెలిప్యాడ్ వరకు రవాణా, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయని ఉబెర్ స్పష్టం చేసింది. అంతేకాదు, ‘ఉబెర్ బోట్’ పేరుతో సముద్ర ప్రయాణాలను కూడా ప్రారంభించనున్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 24 వరకు అందుబాటులో ఉండే ఈ సేవలు సోరెంటో మెరీనా నుంచి ప్రారంభమవుతాయి. గోజో 35 రకానికి చెందిన ఇటాలియన్ బోట్లపై ప్రయాణించడానికి ఇది ప్రత్యేక అవకాశం.
ఇటలీలోని సముద్రతీర ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు ఉబెర్ సేవల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. టెక్నాలజీతో ప్రయాణాలను మరింత ఆసక్తికరంగా మార్చే ఉబెర్ ఈసారి నిజంగా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది.