మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. అయితే ప్రతీ సారి తన మాటలతో మంత్రం వేసి కట్టిపడేసే త్రివిక్రమ్ ఈ సారి మాత్రం తన చేష్టలతో అందరినీ కంట తడి పెట్టించేశాడు. స్టేజ్ మీద మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంటూనే అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేశాడు. అలా ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం, తనకు జీవితాన్నిచ్చిన నిర్మాత స్రవంతి రవికిషోర్ కాళ్లు మొక్కడం చూసి అందరి హృదయాలు బరువెక్కేశాయి.
త్రివిక్రమ్ తన మొదటి రోజులను గుర్తు చేసుకున్నాడు. స్వయం వరం సినిమా రిలీజ్ అయ్యాక ఎవ్వరూ సినిమా ఇవ్వడం లేదని భీమవరం వెళ్లి క్రికెట్ ఆడకుంటు ఉన్నాను. అలాంటి నన్ను పిలిపించి.. నువ్వే కావాలి సినిమా రాయించారు. ఆనాడు ఆయన పిలిపించకపోతే నేను ఇంకా అక్కడే ఉండేవాడిని. ఆయన కేవలం సినిమాల వరకు ప్రయాణం కాదు.. చాలా దూరం ప్రయాణించాం.. చాలా గుర్తులున్నాయి.. ఎన్నో యేళ్ల అనుబంధం ఉందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
ఆయనతో పోట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆయనతో కలిసి నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే ఇలా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీశాం. ఆయన లేకపోతే నేను లేను. ఆయన లాంటి నిర్మాతతో కెరీర్ స్టార్టింగ్‌లోనే పని చేయడం నా అదృష్టం ఆయనకున్న రసికత ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. స్క్రిప్ట్ మొత్తాన్ని చదువుతుంటారు.. అంత గొప్ప సినిమా ప్రేమికుడు అంటూ స్రవంతి రవికిషోర్ గురించి చెబుతూ స్టేజ్ మీదే అతని కాళ్లు మొక్కేశాడు త్రివిక్రమ్. మామూలుగా ఇంత వరకు త్రివిక్రమ్ ఎవ్వరి కాళ్లు మొక్కింది లేదు. కానీ ఇలా మొదటి సారిగా చూసే సరికి అభిమానుల గుండెలు బరువెక్కాయి.