టాలివుడ్ లో విషాదం… మహేష్ బాబు సినిమాలో నటించిన సీనియర్ ఆర్టిస్ట్ గురు స్వామి మృతి…!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగులు ప్రపంచం . ఈ రంగుల ప్రపంచంలో కొంతమంది ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఇలా ఒకే ఒక సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఆర్టిస్ట్ గురుస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా గతంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో రైతు పాత్రలో నటించిన గురుస్వామి తన ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో గురుస్వామి రెండు మూడు సీన్లలో కనిపించినా కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తర్వత అతనికి మరికొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఇలా వయసు పైబడిన తర్వాత సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకొని నటుడిగా మంచి గుర్తింపు పొందిన గురుస్వామి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు.

గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు నాటక రంగంలో రాణించారు. నాటక రంగంలో మంచి గుర్తింపు పొందిన గురుస్వామికి వంశీ పైడిపల్లి మహర్షి సినిమాలో అవకాశం కల్పించారు. ఈ సినిమాలో గురుస్వామి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అనారోగ్యంతో ఆయన మృతి చెందడం వల్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా గురుస్వామి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. గురుస్వామి మృతితో ఇండస్ట్రీ మరొక గొప్ప నటుడిని కోల్పోయింది.