తాజాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు… సూపర్ హీరోల పట్ల చిత్రపరిశ్రమ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ఈ జానర్ ఇప్పుడు బిగ్ బడ్జెట్, పాన్ ఇండియా కాన్సెప్ట్ లతో దూసుకొస్తోంది. ఇప్పటికే ‘మినిమల్ ఫాంటసీ’ సినిమాలకు బ్రేక్ ఇచ్చేలా భారీగా సెట్ చేసే చిత్రాలు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ లో తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న మిరాయ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా ఇప్పటికే మార్క్ చేసుకుంది.
ఇదే జానర్ లో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ సూపర్ హీరో మూవీపై మాసివ్ హైప్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ, విజువల్స్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలోనే హైబజ్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్‌తో రూపొందే ఈ చిత్రం వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుందని సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, హీరోయిజం ఉంటాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
అంతేకాదు, ప్రశాంత్ వర్మ ‘అధీర’, రవితేజ – కళ్యాణ్ శంకర్ కాంబోలో రానున్న చిత్రం, అలాగే మహాకాళి లాంటి సినిమాలు కూడా ఈ జానర్ లోనే వస్తుండటం విశేషం. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ తన క్రిష్ 4తో మరోసారి మాస్క్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో ఒక సూపర్ హీరో మూవీతో కొత్త ప్రయోగం చేయనున్నట్టు టాక్ ఉంది. దీంతోపాటు శక్తిమాన్ ఫిల్మ్ అడాప్టేషన్ కూడానే వస్తోంది. మొత్తంగా చూస్తే… సూపర్ హీరోల కాలం మళ్లీ మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతోంది. ఈసారి వాళ్ల సత్తా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.