కొరటాల శివ సినిమాలో అల్లు అర్జున్ కనిపించేదెలాగో డిసైడ్ చేసేశారు..!

కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 21 గా రాబోతోంది. ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ ఎప్పుడో రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ని ఫైనల్ చేశాడట దర్శకుడు కొరటాల శివ. అల్లు అర్జున్ ని అల్ట్రా మోడ్రన్ లుక్ లో చూపించబోతున్నాడని తాజా సమాచారం.

ఇక సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే రష్మిక మందన్న, కృతి శెట్టి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2022 లో రిలీజ్ చేస్తామని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

అలాగే అల్లు అర్జున్ మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఆగస్టు 13 న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. ఈ క్రమంలో కొరటాల శివ ఆచార్య .. అల్లు అర్జున్ పుష్ప సినిమాలు కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ కొరటాల శివ ల ప్రాజెక్ట్ మొదలవబోతోంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియన్ సినిమాగా కొరటాల శివ తెరకెక్కిస్తాడని సమాచారం.