మెగాస్టార్ వదిలేసిన కథ..వెబ్‌ సీరిస్‌గా సూపర్‌ డూపర్‌ హిట్‌!

ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల హవా ఎలా ఉందంటే.. వారం వచ్చిందంటే చాలు కొత్త వెబ్‌ సిరీస్‌ ఏది వస్తుందని ఓటీటీ ప్రియులు తెగ వెతికేస్తున్నారు. కంటెంట్‌ కొత్తగా అనిపిస్తే.. ఐదారు గంటలైన అలవోకగా చూసేస్తున్నారు. కాగా అలాంటి వెబ్‌ సిరీస్‌లకు ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిన వాటిలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ ఒకటి. దర్శక ద్వయం రాజ్‌/డీకేలు రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కు దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినీ ప్రియులు ఈ వెబ్‌ సిరీస్‌ను తెగ ఆదరించారు.

ఇప్పటికీ టాప్‌ 10 బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ తీస్తే అందులో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది. ఆఫర్‌ల కోసం కాచుకుని చూస్తున్న మనోజ్‌ బాజ్‌పాయిను ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడున్న బిజీయెస్ట్‌ యాక్టర్‌లలో ఒకడిని చేసింది. ఈ సిరీస్‌ నుంచి వచ్చిన రెండు సీజన్‌లు ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ తెచ్చుకున్నాయి. ఇక త్వరలో మూడో సీజన్‌ కూడా రాబోతుంది. కాగా ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ కథ ముందుగా చిరంజీవి దగ్గరికి వెళ్లిందట.

గతంలో రాజ్‌/డీకేలు ముందుగా ఈ వెబ్‌ సిరీస్‌ను సినిమా కథగా రాసుకుని అశ్వినీదత్‌కు చెప్పారట. అశ్వినీదత్‌కు కథ పిచ్చ పిచ్చగా నచ్చడంతో వెంటనే చిరును కలిసి వినిపించాడట. ఇక చిరు సైతం కథ విని అద్భుతంగా ఉందంటూ ప్రశంసించాడట. అయితే అప్పుడు ‘ఖైదీ 150’తో వీర లెవల్లో కంబ్యాక్‌ ఇచ్చిన తనను.. ఇద్దరు పిల్లల తండ్రిగా జనాలు యాక్సెప్ట్‌ చేస్తారో లేదో అని చిరు చిన్న సందిగ్ధంలో పడ్డాడట.

దాంతో పిల్లలు లేకుండా స్క్రిప్ట్‌ను చేంజ్‌ చేయమని చెప్పారట. అయితే పిల్లల క్యారెక్టర్‌లు లేకపోవడం అనే పాయింట్‌ కథ షేప్‌ను పోగొడుతుందని రాజ్‌/డీకేలు భావించారు. వీటితో పాటు మరికొన్ని సంశయాల మధ్య ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడింది. ఇక అదే కథను తర్వాత వెబ్‌ సిరీస్‌గా మార్చి మనోజ్‌తో రూపొందించారు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్‌ స్వయంగా చెప్పడం విశేషం.

నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి కథ చేస్తే జనాలు ఒప్పుకునే అవకాశాలు కూడా తక్కువే ఉన్నాయి. అదీ కూడా ‘ఖైదీ నెంబర్‌ 150’ వంటి బంపర్‌ హిట్టు తర్వాత అంటే అస్సలు ఒప్పుకునే వారు కాదు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి సినిమా చేస్తే మట్టుకు మంచి రెస్పాన్స్‌ రావడం పక్కా అని పలువురు సినీ ప్రేమికులు వాపోతున్నారు.