టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తెలుగు సినిమా చేసి చాలా కాలమైంది. చివరగా ఆమె నాగచైతన్య శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత కూడా ఆమెకు పలు రకాల ఆఫర్స్ అయితే వచ్చాయి. కానీ కంటెంట్ నచ్చకపోవడంతో వాటిని చేయడానికి ఒప్పుకోలేదు.
పారితోషికం ఎంత ఇచ్చినా కూడా సాయి పల్లవి ఏమాత్రం సినిమా చేయడానికి ఒప్పుకోదు అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. అందుకే కథలో హీరోయిన్ పాత్ర ఎంతో బలంగా ఉంటే గాని ఆమెను సంప్రదించడం లేదు. ఇక మొత్తానికి చాలా కాలం తర్వాత ఆమెకు నచ్చిన కథ లో నటించే ఆఫర్ దొరికినట్లుగా తెలుస్తోంది.
అయితే దానికి కొంత సమయం పెట్టె అవకాశం ఉందట. మెగా హీరో సాయిధరమ్ తేజ్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కథకు హీరోయిన్ గా సాయి పల్లవి అయితేనే బాగుంటుంది అని ఇద్దరు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కూడా ఆమెకు చెప్పడంతో పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం చందు నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవడానికి ఒక 8 లేదా 10 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ముందుగానే దర్శకుడు సాయి పల్లవికి కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. మరి ఆ ప్రాజెక్ట్ కంటే ముందు సాయి పల్లవి మరో తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.