తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భరత భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సమస్యలు, ‘గద్దర్’ అవార్డ్స్ గురించి చర్చించారు. రెండ్రోజుల క్రితం ఓ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమ, గద్దర్ అవార్డ్స్ ప్రతిపాదనను పట్టించుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత భూషణ్ ఆయన్ను కలిశారు.
ఆయన మాట్లాడుతూ ’బిజీ షెడ్యూల్‌లోనూ సీఎంగారు కలిసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని సీఎం చెప్పడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ’ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్‌కు అభినందనలు. అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.