సీనియర్ నటి సౌందర్య మరణానికి సంబంధించిన వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరగలేదని, ఆమెను పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందులో భాగంగా, ప్రముఖ నటుడు మోహన్ బాబుపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని జల్ పల్లి ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ విషయంలోనూ ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు తొలిసారి స్పందిస్తూ, అసలు నిజం ఏంటో స్పష్టం చేశారు. సౌందర్య 2003లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రఘును వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా, ప్రమాదవశాత్తు కుప్పకూలి దుర్మరణం చెందారు. అప్పటినుంచి సౌందర్య భర్త రఘు పబ్లిక్‌గా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఈ వివాదం తలెత్తిన నేపథ్యంలో, అసత్య ప్రచారాలను ఖండిస్తూ నిజమైన విషయాలు బయటపెట్టారు.
రఘు మాట్లాడుతూ, సౌందర్య మరణానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం అని చెప్పారు. ముఖ్యంగా, మోహన్ బాబుపై ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని, ఆయన తమ కుటుంబానికి ఎప్పుడూ మంచివాడిగానే మెలిగారని చెప్పారు. సౌందర్య మరణించిన తరువాత కూడా తమ కుటుంబంతో మోహన్ బాబు స్నేహపూర్వకంగా ఉంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రాపర్టీ విషయంలోనూ అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయని, అసలు ఆస్తి విషయంలో తమకు, మోహన్ బాబుకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.
అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం, అసత్య వార్తలు ప్రచారం చేయడం సరికాదని రఘు అన్నారు. తప్పుడు కథనాలతో మోహన్ బాబును టార్గెట్ చేయడం తగదని, నిజాలు తెలుసుకోకుండా ఎవరి మీదనైనా ఆరోపణలు చేయడం బాధ్యతారహితంగా మారుతోందని అన్నారు. సౌందర్య మరణం విషయంలో ఇప్పటికే ఎన్నో విచారణలు జరిగాయని, ఇది కఠినమైన వాస్తవం అని ఆయన తెలిపారు.