ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎన్ని శుభకార్యాలు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరోనా టైంలో దిల్ రాజు తన రెండో పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత రానా, నితిన్, నిఖిల్, కాజల్ అగర్వాల్,నిహారిక ఇలా పలువురు నటీనటులు, సింగర్స్, దర్శకులు పెళ్లి పీటలెక్కారు. ఇన్నాళ్లు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న సింగర్స్ అందరు పెళ్లి పీటలెక్కే సరికి అభిమానులు కూడా తెగ సంతోషించారు. అయితే కరోనా వలన చాలా మంది సెలబ్రిటీలు సాదాసీదాగా జరిగిన, నిహారిక పెళ్లి మాత్రం ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
కరోనా నిబంధనలు పాటిస్తూనే నిహారిక-చైతన్య పెళ్ళి వేడుక జరిపించారు. రెండు రోజుల ముందే మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్‌లో వాలగా, అక్కడ వారు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వేడుకలకు పెద్దగా హాజరు కాని పవన్ కళ్యాణ్ కూడా నిహారిక పెళ్లిలో సందడి చేసే సరికి అభిమానులకి కూడా ఈ వేడుక కనుల పండుగగా మారింది. ఇక మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ బ్యాచిలర్స్‌గా ఉండగా, వీరి పెళ్ళి ఎప్పుడు ఉంటుందా అనే ఆలోచనలో పడ్డారు అభిమానులు. రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్‌ని ఓ ఇంటర్వ్యూలో తర్వాతి పెళ్ళి ఎవరిది అడగగా, నా కన్నా పెద్దవాడు శిరీష్. వచ్చే ఏడాది అతని పెళ్లి ఉంటుంది అని అన్నాడు. దీంతో శిరీష్ నుండి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు నెటిజన్స్.
సాయి ధరమ్ తేజ్ చెప్పినప్పటి నుండి నెటిజన్స్.. శిరీష్ పెళ్ళి గురించి అడగడం మొదలు పెట్టారు. దీంతో విసుగు చెందిన శిరీష్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. హహహ.. తేజూ నా పెళ్లి విషయంలో సరదాగా జోక్ చేసి ఉంటాడు. మీరు దానిని సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లి విషయంలో మా పేరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అన్ని విషయాలూ నేను చెబుతాన`ని శిరీష్ ట్వీట్ చేశాడు. అల్లు శిరీష్ హీరోగా పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ప్రస్తుతం మంచి కథలని వింటున్నట్టు తెలుస్తుంది.