కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరో, హీరోయిన్ల జాబితాలో శింబు, వరలక్ష్మి శరత్‌కుమార్ ఉన్నారు. అయితే, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మూడు నాలుగు రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. గతంలోనూ వీరిద్దరిపై ఇలాంటి వార్తలే వచ్చాయి. దీనికి బలమైన కారణం లేకపోలేదు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా కలిసి నటించడం, సినీ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడం, పైగా వీరి తల్లిదండ్రులు మంచి స్నేహితులవడంతో ఈ వార్తలు నిజమై ఉంటాయని భావించారు. పైగా, శింబు పుట్టిన రోజైన ఫిబ్రవరి 3న శుభవార్తను వెల్లడిస్తానని ప్రకటించారు.
దీంతో వరలక్ష్మితో పెళ్లి గురించిన ప్రకటనే అయ్యింటుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో శింబు, వరలక్ష్మి ఈ వదంతులపై వేర్వేరుగా స్పందించారు. ‘నేను, వరలక్ష్మి మంచి స్నేహితులం. నేను ఆమెను వివాహం చేసుకోవడం లేదు’ అంటూ శింబు స్పష్టం చేస్తే.. ‘శింబుకు నాకు పెళ్లి జరగడం లేదు. అతను నా స్నేహితుడు’ అని వరలక్ష్మి శరత్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో శింబు, వరలక్ష్మీ శరత్ కుమార్‌ల పెళ్లి అనే వదంతులకు ఫుల్‌స్టాఫ్ వారిద్దరే పెట్టేశారు.
ఇక వీరిద్దరూ నటులుగా బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘హను-మాన్’ సినిమాతో వరలక్ష్మీ బ్లాక్‌బస్టర్ అందుకుంటే.. కాస్త గ్యాప్ తర్వాత శింబు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు. శింబు హీరోగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిర్మించనున్న చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఇక పెళ్లి అనే విషయంలోకి వస్తే.. వీరిద్దరి విషయంలోనూ పెళ్లి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.
మరీ ముఖ్యంగా శింబు విషయంలో నిశ్చితార్థం వరకు వెళ్లి.. పెళ్లి ఆగిపోయిన రోజులున్నాయి. హీరోయిన్ హన్సిక తో శింబు పెళ్లి వ్యవహారం ఏమైందో అందరికీ తెలిసిందే. అలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు కూడా శింబు విషయంలో ఆ మధ్య బాగా వినిపించాయి. వరలక్ష్మి విషయానికి వస్తే హీరో విశాల్ తో ఆమె పెళ్లి కూడా దాదాపు పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా శింబు అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఇద్దరూ వెంటనే స్పందించి.. ఆదిలోనే ఈ వార్తలకు బ్రేక్ వేశారు.