మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన షూటింగ్ లీక్ కావడం పెద్ద సంచలనంగా మారింది. ఒడిశాలో జరిగిన అవుట్‌డోర్ షెడ్యూల్‌లో ఒక ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడం మూవీ టీమ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. రాజమౌళి సినిమాలంటే అత్యంత రహస్యంగా చిత్రీకరించబడతాయని అందరికీ తెలుసు. కానీ ఈసారి లీక్ దెబ్బకు దర్శకుడు తన ప్లాన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తాజా లీక్ వల్ల ఆన్‌లొకేషన్ షూటింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించిన రాజమౌళి, ఇకపై ఎక్కువగా స్టూడియో సెట్స్‌పైనే ఆధారపడాలని భావిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ముందుగా ఫిక్స్ చేసిన కొన్ని రియల్ లొకేషన్లను పక్కన పెట్టి, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల లీక్ సమస్యను కంట్రోల్ చేయడంతో పాటు, భారీ వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం.
మహేష్ బాబు కూడా ఎక్కువగా ఇండోర్ షూటింగ్‌లను ప్రిఫర్ చేసే నటుడు. స్టూడియో సెట్స్‌లోనే ఎక్కువగా సినిమాలు పూర్తి చేసిన అనుభవం ఉన్న మహేష్‌కి రాజమౌళి తాజా వ్యూహం మంచిదేనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినప్పటికీ, లీక్‌లను అడ్డుకోవడం, భద్రతను కట్టుదిట్టం చేయడం చాలా ముఖ్యమని టీమ్ భావిస్తోంది.
అంతేకాకుండా, షూటింగ్ లొకేషన్ల వద్ద భద్రతను మరింత పెంచేందుకు, మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. విదేశీ షెడ్యూల్ కోసం కూడా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, లీక్ జరిగినా, జక్కన్న తన పద్ధతిలో కొత్త వ్యూహాన్ని అద్భుతంగా అమలు చేయనున్నట్లు కనిపిస్తోంది.