ఆ రెండు హిట్ అయితే శంకర్ ఫోకస్ వాటిపైనే

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శంకర్. ప్రస్తుతం ఈ దర్శకుడు ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలని ఒకేసారి సెట్స్ పైకి తీసుకొని వెళ్లి చేస్తున్నారు. తమిళంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఇండియన్ 2 కమల్ హాసన్ తో సిద్ధమవుతోంది. మరో వైపు దిల్ రాజు నిర్మాణంలో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తోనే రెండు సినిమాలు సిద్ధం అవుతూ ఉండటం విశేషం. ఇండియన్ 2 షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు శంకర్ గేమ్ చేంజర్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసారంట. శంకర్ లేకుండానే ఓ రెండు రోజులు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

శైలేష్ కొలను దర్శకత్వంలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2, గేమ్ చేంజర్ మూవీస్ ఇప్పుడు శంకర్ కి కచ్చితంగా సక్సెస్ ఇవ్వాలి. ఈ రెండు చిత్రాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని శంకర్ ఆవిష్కరిస్తున్నారు. తెలుగులో ఫస్ట్ మూవీగా వస్తోన్న గేమ్ చేంజర్ తో సూపర్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు.

అలాగే ఇండియన్ కి సీక్వెల్ గా వస్తోన్న ఇండియన్ 2 పైన కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత హిందీలో రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు 2 మూవీని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఇళయదళపతి విజయ్ శంకర్ తో ఒక మూవీ చేయాలని అనుకుంటున్నారు.

రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఉన్న విజయ్ దానికోసం శంకర్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. గేమ్ చేంజర్, ఇండియన్ 2 రిలీజ్ తర్వాతనే ఈ సినిమాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చేస్తోన్న మూవీస్ సక్సెస్ బట్టి విజయ్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.