సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 66వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు తమ పాటలతో సందడి చేశారు. అంతర్జాతీయ వేదికపై జరిగిన ఈ వేడుకలో భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్ , జాకీర్ హుస్సేన్ విజయకేతనం ఎగురవేశారు.
‘శక్తి’ పేరుతో ఈ టీమ్ కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. జాన్ మెక్లాప్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్(సింగర్), గణెళిశ్ రాజగోపాలన్ (వయోలిన్) ఇలా ప్రతిభ గల ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరుతో ఈ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పోటీని ఎదుర్కొని ‘శక్తి’ టీమ్ విజేతగా నిలిచింది. వీరికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి.
అలాగే మిడ్ నైట్స్ ఆల్బమ్‌కు గానూ టేలర్ స్విప్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఈయర్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్బంగా శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ’ప్రతి విషయంలో నాకు ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా” అని తెలిపారు.