శాకుంతలం కష్టాలు తీరవా?

సమంత విడాకుల తర్వాత చేస్తున్న అన్ని సినిమాల మీద ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఇప్పటికే యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది. ఆమె చేసిన శాకుంతలం అనే సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 14వ తేదీన విడుదలవుతుందని చివరిగా ప్రకటించారు. అంటే రిలీజ్ డేట్ చాలా దగ్గరకు వచ్చేసింది.

ఇంకా 36 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో అడుగుపెడుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించిన గుణశేఖర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాని గుణశేఖర్ సొంత నిర్మాణంలో తెరకెక్కించారు . సమర్పకుడిగా దిల్ రాజు ఉన్న పెద్ద ఎత్తున ఆయన రిలీజ్ చేయడానికి అండ దండలు చూపిస్తున్నా… బడ్జెట్ చేయి దాటిపోవడం వల్ల అంత డబ్బు వెనక్కి వస్తుందా? రాదా? అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

ట్రైలర్ కట్ కూడా ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయిన నేపథ్యంలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన అన్ని భాషల్లోనూ హిట్ అవుతుందా లేదా అనే విషయం మీద దర్శకుడు టెన్షన్ పడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే బడ్జెట్ 70 కోట్ల దాకా అయ్యిందని థియేటర్ రైట్స్ కి 30 కోట్లకు మించి రాకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే డిజిటల్ శాటిలైట్ రైట్స్ మాత్రమే 50 కోట్ల వరకు రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంత పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాకి తెలుగు, తమిళం సహా మిగతా భాషల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఎందుకంటే ఈ కథ ట్రాజెడీతో ముగుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా అదే రోజు రుద్రుడు, బిచ్చగాడు లాంటి తమిళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో తమిళనాడు ఓపెనింగ్స్ రిస్క్ లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేశారు కాబట్టి ఈసారి వాయిదా వేయకపోవచ్చు కానీ ఇబ్బంది తప్పదనే మాట వినిపిస్తోంది.