స‌ర్కారు వారి పాట మొద‌లు.. మ‌ళ్ళీ మ‌హేష్ డుమ్మా

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం సర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్ర షూటింగ్ కొద్ది సేప‌టి క్రితం కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందం హాజ‌రు కాగా, మ‌హేష్ కూతురు సితార స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సర్కారు వారి పాట చిత్రానికి సితార ఫ‌స్ట్ క్లాప్ కొట్ట‌గా, న‌మ్ర‌త స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తం షాట్‌ని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో చిత్రీకరించారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

గ‌త సినిమాల మాదిరిగానే మ‌హేష్ ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌కి హాజ‌రు కాలేదు. ఇది సెంటిమెంటో ఏమో తెలియ‌దు కాని స‌రిలేరు నీకెవ్వ‌రు, భ‌ర‌త్ అనే నేను చిత్రాల షూటింగ్ స‌మయంలోను మ‌హేష్ అటెండ్ కాలేదు. న‌మ్ర‌త‌నే హాజ‌రై త‌తంగం పూర్తి చేసింది. ఇదిలా ఉంటే మ‌హేష్ కొద్ది రోజుల క్రితం దుబాయ్ త‌న ఫ్యామిలీతో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. వెకేష‌న్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి.