దర్శకుడు కొరటాల శివ గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మహేష్‌బాబు హీరోగా నటించిన సినిమా అది. అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది కూడా.! కానీ, అదో కాపీ స్టోరీ.. అని చాలాకాలంగా గొడవ నడుస్తోంది.
సినీ పరిశ్రమలో ఇలాంటి వివాదాలు తరచూ చూస్తూనే వుంటాం. కానీ, ‘శ్రీమంతుడు’ పరిస్థితి వేరు. తాను రాసిన కథలోని లైన్ టు లైన్ కాపీ కొట్టేశారంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి న్యాయ పోరాటం మొదలు పెట్టారు.
కానీ, దర్శకుడు కొరటాల ఒప్పుకోలేదు. పైకి ఒప్పుకోకుండా, తెరవెనుక లాబీయింగ్ వ్యవహారాలు నడిపాడు. డబ్బులిస్తామని రచయిత ముందు ప్రతిపాదన పెట్టారు. దాంతో, ఒరిజినల్ రచయిత మరింత గుస్సా అయ్యాడు.
సుప్రీంకోర్టులోనూ కొరటాల శివకి చుక్కెదురవడంతో, తెరవెనుకాల సెటిల్మెంట్ వ్యవహారాలు షురూ అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద మనిషి రంగంలోకి దిగితేనే పరిస్థితి చక్కబడుతుందన్న ప్రచారం సినీ పరిశ్రమలో జరుగుతోంది.
ఇప్పటికే ఈ విషయమై చిరంజీవితో కొరటాల శివ చర్చించాడంటున్నారు. అదెంత నిజమో తెలియదు. ఎందుకంటే, ‘ఆచార్య’ సినిమా ఫలితం నేపథ్యంలో కొరటాల – చిరంజీవి మధ్య విభేదాలొచ్చాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
పరిశ్రమ పెద్దన్నగా చిరంజీవి తప్ప, ఈ వివాదాన్ని ఇంకెవరూ సెటిల్ చేయలేరని, ‘శ్రీమంతుడు’ హీరో మహేష్‌బాబు, కొరటాల శివకి సూచించాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.