బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ సమంత చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలోనూ అందరం సమిష్టిగా కలిసి పని చేశామని, దీని కోసమే ఎన్నో యేళ్లుగా కలలు కంటున్నామని సమంత చెప్పుకొచ్చింద. ఇన్నాళ్లు తనపై ప్రేమను కురిపిస్తూ వెన్నంటే ఉన్నవారికి ఈ విషయాన్ని చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉందంటూ సమంత చెప్పడంతో ఆ ప్రకటన ఏంటో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఆ సంగతేంటో సమంత తాజాగా ప్రకటించింది.
సమంత చదువుకునే రోజుల్లో ప్యాకెట్ మనీ కోసం ఫ్యాషన్ డిజైనర్, మోడలింగ్ పనులను చేస్తూ ఉండేది. అక్కడి నుంచి సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తనకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎంతో ఇష్టమని, మొత్తానికి తన కల ఇన్నాళ్లకు నెరవేరబోతోందని సమంత సంతోషాన్ని వ్యక్తం చేసింది. సాకి అనే ఫ్యాషన్ డిజైన్ బ్రాండ్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతోన్నట్టు ప్రకటించింది.
వీటికోసం లాక్డౌన్‌లో తన స్టాఫ్‌తో కలిసి ఎంతో కష్టపడ్డామని, వారి సహకారంతో ఇదంతా సాధ్యం అయిందని సమంత చెప్పుకొచ్చింది. త్వరలోనే వీటిని లాంచ్ చేస్తానని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అంటూ సమంత పోస్ట్ చేసింది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మధ్యే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించింది. తన పాత్ర ఎంతో బాగా వచ్చిందని సంబరపడిపోయింది.