శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల పెళ్ళైన చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీలో పెళ్ళి సందడి నెలకొంది. డిసెంబర్ 9న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్ళి చైతన్యతో ఘనంగా జరిగింది.పెళ్ళితో పాటు సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలు ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. మెగా హీరోలు అంతా ఈ పెళ్లి వేడుకలో ప్రత్యక్షం అయ్యే సరికి ఫ్యాన్స్ కు కనుల పండుగగా ఉంది. పెద్దగా వేడుకలకి వెళ్లని పవన్ కూడా నిహారిక పెళ్లిలో కనిపించే సరికి ఈ వేడుక నిండుగా కనిపించింది.
నిహారిక పెళ్ళి పూర్తైంది. ఇక మెగా ఫ్యామిలీలో ఉన్న బ్యాచిలర్స్ వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్‌ల పెళ్లి గురించి చర్చ మొదలైంది. ఇందులో భాగంగా సాయిధరమ్ తేజ్‌ని ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలో తర్వాతి వేడుక ఎవరిది అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇచ్చిన సాయి.. వచ్చే ఏడాది అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కానున్నాడు అని బదులిచ్చాడు. శిరీష్ నా కన్నా పెద్ద. అతని పెళ్ళి తర్వాత నాది ఉంటుంది. నాకు కొన్ని కలలు ఉన్నాయి . వాటిని నెరవేర్చుకున్నాక పెళ్ళి చేసుకుంటాను అని బదులిచ్చాడు సాయిధరమ్ తేజ్.
సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రానుండగా, ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు తేజూ. ఈ సినిమా ద్వారా సగటు వ్యక్తికి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందిన ఈ ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించాడు. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది.