‘రవికుల రఘురామ’ ట్రైలర్‌ విడుదల

పాజిటివ్‌ వైబ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రవికుల రఘురామ’. చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో.. సినిమా నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్‌ ఉన్న శ్రీధర్‌ వర్మ సాగి నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్‌ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ .. మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన ‘చందమామే’,’ప్రాణాలే’ సాంగ్స్‌ శ్రోతలని అలరించగా.. తాజాగా మేకర్స్‌ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు.

ట్రైలర్‌ విడుదల అనంతరం విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. అలాగే ఈ సినిమాకు వర్క్‌ చేసిన నటీనటులు, సాంకేతికనిపుణులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిత్ర విడుదల సందర్భంగా మూవీ యూనిట్‌కు అభినందనలు తెలియ జేస్తున్నానని అన్నారు.

చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ట్రైలర్‌ విడుదల చేసిన విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతికి మా టీమ్‌ తరపున ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో ఈ సినిమా రేంజే మారిపోయింది. ట్రైలర్‌ ఆయనకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ట్రైలరే కాదు.. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు సుకుమార్‌ పమ్మి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. సినిమా విడుదల తర్వాత ఒక మంచి సినిమా తీశామని మాకు, చూశామని ప్రేక్షకులకు అనిపించేలా.. ఈ సినిమా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు.