అపజయాల గురించి ఆలోచించను: రష్మిక

వరుస విజయాలు అందుకుంటూ ఫుల్ జోష్‌ మీద ఉన్నారు రష్మిక. ఇటీవల ‘యానిమల్‌’లో తన నటనతో మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను విజయాలను పెద్దగా పట్టించుకోనన్నారు. దానికి గల కారణాన్ని వివరించారు. నాకంటే అందమైన, తెలివైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్లు నటనలోనూ ప్రతిభావంతులే. మనల్ని మనం నిరూపించుకునే అవకాశం కొద్దిమందికే వస్తుంది.

నాకు అలాంటి అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థానంలో ఉన్నాను. నన్ను గుర్తించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. కెరీర్‌లో సాధించిన జయాపజయాలను పట్టించుకోకూడదు. ఏ రంగంలోనైనా అవి సాధారణం. ఇటీవలే ఈ విషయాన్ని తెలుసుకున్నాను. మనం చేసే ప్రతీ పనిని ప్రేక్షకులు గమనిస్తారు. ప్రశంసలు, విమర్శలు ఎదురవుతాయి. వాటి గురించి ఆలోచిస్తే మానసికంగా కుంగిపోతాం. జీవితంలో ముందుకుసాగలేం. అందుకే వాటిని పట్టించుకోను అని చెప్పారు.

ప్రస్తుతం రష్మిక తెలుగు, హిందీల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో నటిస్తున్నారు. అందులో శ్రీవల్లిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయఅవార్డు రావడం, దేవిశ్రీ ప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న ఇది విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన రష్మిక లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.