‘యానిమల్‌’ కోసం ఎంతో కష్టపడ్డా: రష్మిక!

’యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో అభిమానుల్ని మెప్పించింది రష్మిక. విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో కర్వాచౌత్‌ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమె విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆమెపై వస్తోన్న ట్రోల్స్‌ గురించి స్పందిస్తూ… ‘యానిమల్‌’లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ చెప్పే విధానం బాగాలేదని విమర్శిస్తున్నారు. అందులో కర్వాచౌత్‌ సన్నివేశం గురించి ఎక్కువ ట్రోల్స్‌ చేస్తున్నారు.

కానీ.. ఆ సన్నివేశం ఈ సినిమాకే ప్రత్యేకం. ఒక్క సీన్‌లోనే ఎన్నోరకాల హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. దానికోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందులో నా నటన చూసి సెట్లో, థియేటర్లలో మంచి ప్రశంసలు వచ్చాయి. విచిత్రమేంటంటే.. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్‌ బాగాలేదని నన్ను ట్రోల్స్‌ చేశారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అయినా ఎవరి అభిరుచి వాళ్లది. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా‘ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ’పుష్ప 2’, ’ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రీకరణలో ఉందామె.