రణ్‌బీర్‌కు తెలుగు నేర్పిస్తున్న రష్మిక!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్‌’ కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌ ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్‌ డిసెంబర్‌ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యానిమల్‌ టీం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో ఫుల్‌ బిజీగా మారిపోయింది.

యానిమల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియన్‌ ఐడల్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ షూట్‌ కోసం ముంబైలో సందడి చేశారు హీరోహీరోయిన్లు. రణ్‌బీర్‌కపూర్‌ బ్లూ సూట్‌లో.. రష్మిక మందన్నా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయారు. స్టూడియోలోకి వెళ్లేముందు రణ్‌బీర్‌కపూర్‌ను తెలుగులో మాట్లాడాలని అడిగాడు అక్కడే ఉన్న ఓ రిపోర్టర్‌. రణ్‌బీర్‌కపూర్‌ తెలుగులో అందరికీ నమస్కారం చెప్పాడు. ఆ తర్వాత మాట్లాడటానికి ఇబ్బంది పడితే.. పక్కనే ఉన్న రష్మిక సాయం చేసింది.

నేను బాగున్నాను.. మీరు బాగున్నారా.. అంటూ రణ్‌బీర్‌కపూర్‌ కు చెప్పింది రష్మిక మందన్నా. మరోవైపు రణ్‌బీర్‌కపూర్‌కు కన్నడ కూడా నేర్పించింది రష్మిక. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్‌ చేసిన థర్డ్‌ సింగిల్‌ నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి హర్షవర్దన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే లాంఛ్‌ చేసిన యానిమల్‌ పోస్టర్లు నెట్టింట వైరల్‌ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యానిమల్‌ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.