రానా ఆరోగ్యంపై వచ్చినన్నీ వార్తలు, రూమర్లు మరేతర హీరోపై వచ్చి ఉండవు. రానా బక్కగా అయినా లావుగా అయినా కాస్త తేడాగా కనిపించినా వార్తలు వైరల్ అయ్యేవి. వింత వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతూ కథనాలు వడ్డించే వారు. రానాకు కిడ్నీ సమస్య వచ్చిందని, వైద్యం నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారని రాశారు. రానా తల్లి లక్ష్మి ఆయనకు ఒక కిడ్నీని దానం చేశారని కూడా రాసేశారు. అరణ్య సినిమా టైంలో అయితే ఆ రూమర్లు మరీ ఎక్కువయ్యాయి.
ఆ సినిమా కోసం రానా బాగా సన్నబడితే కూడా ఆరోగ్య సమస్యలే అని రాశారు. అయితే ఇలాంటి రూమర్లపై రానా ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ మొదటి సారిగా రానా వాటన్నంటిపై స్పందించాడు.
రానాకు నిజంగానే కిడ్నీ సమస్య వచ్చిందట. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించాడు. సమంత సామ్ జామ్ టాక్ షోలో పాల్గొన్న రానా దగ్గుబాటి.. తన ఆరోగ్య సమస్యలపై స్పందించాడు. మొదటి ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ గెస్ట్‌గా రాగా.. రెండో ఎపిసోడ్‌లో రానా, నాగ్ అశ్విన్ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది.
అందులో రానా తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘‘జీవితం వేగంగా ముందుకు వెళ్తోన్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వస్తుంది. పుట్టినప్పటి నుంచే బీపీ ఉంది. దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది.. నీ కిడ్నీలు కూడా పాడవుతాయి అని చెప్పారు. స్ట్రోక్ హెమరేజ్ (మెదడులో నరాలు చిట్లిపోవడం)కు 70 శాతం, చనిపోవడానికి 30 శాతం ఛాన్స్ ఉందని చెప్పారు’’ అని ప్రోమోలో రానా చెప్పుకొచ్చాడు. మొత్తనాకి భళ్లాలదేవుడు మాత్రం చాలా గట్టిగానే పోరాడినట్టున్నాడు.