రామాయణ దృశ్యకావ్యం.. ఆస్కార్‌ విజేతల సంగీతం

ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన దృశ్య కావ్యం రామాయణం. ఈ ఇతిహాస కథతో ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు, సీరియల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ప్రభాస్‌ కూడా ఆదిపురుష్‌ అంటూ మోషన్‌ క్యాప్చర్‌తో సినిమా తీసి ప్రేక్షకులను అలరించాడు. అయితే రామాయణం కాన్సెప్ట్‌తో మరో మూవీ రాబోతుంది. దంగల్‌ దర్శకుడు నితీష్‌ తీవారి మరోసారి ఈ ఇతిహాస కథను తెరపైకి తీసుకురావడానికి రెడీ అయ్యాడు. యానిమల్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానుండగా.. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.

ఇక ఈ చిత్రంలో రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్‌ స్టార్‌ యష్‌ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మూవీకి సంగీతం అందించడం కోసం ఇద్దరు ఆస్కార్‌ విన్నర్లు రాబోతున్నారట.

ఇందులో ఒకరు ఇండియన్‌ ఆస్కార్‌ విన్నర్‌ ఏ ఆర్‌ రెహమాన్‌ కాగా.. ఇంకొకరు హాలీవుడ్‌ ఆస్కార్‌ విన్నర్‌ హన్స్‌ జిమ్మెర్‌. వీరిద్దరూ కలిసి రామయణం సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై నితీష్‌ తీవారి ఏ ఆర్‌ రెహమాన్‌, హన్స్‌ జిమ్మెర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ది లయన్‌ కింగ్‌, డార్క్‌ నైట్‌ ట్రయాలజీ, ఇన్‌సెప్షన్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు హన్స్‌ జిమ్మెర్‌. ఏప్రిల్‌ 17న శ్రీరామ నవమి రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. వచ్చే నెలలో ముంబైలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని.. అలాగే ఈ ప్రాజెక్ట్‌ మొదటి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.