టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లు వేగం పుంజుకోవడంతో ఆసక్తికర అంశాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి.
గేమ్ ఛేంజర్‌లో పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, ప్రతీ పాటకూ తగినంత ప్రాధాన్యతనిచ్చి గ్రాండ్‌గా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఇందులో “జరగండి” పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ పాట కోసం 70 అడుగుల ఎత్తు కొండపై విలేజ్ సెట్ వేయడంతో పాటు, 600 మంది డ్యాన్సర్లతో 8 రోజులు పాటు షూట్ చేశారు. పర్యావరణానికి అనుకూలంగా జనపనారతో తయారైన కాస్ట్యూమ్స్ ఈ పాటలో వాడటం విశేషం.
ఇక “రా మచ్చా మచ్చా” అనే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. భారతీయ జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ, 1000 మంది జానపద కళాకారులతో ఈ పాటను చిత్రీకరించారు. వివిధ రాష్ట్రాల జానపద నృత్య శైలులను కలిపి రూపొందించిన ఈ పాటకు గణేశ్ ఆచార్య నృత్యరూపకల్పన చేశారు. ఇది ప్రేక్షకులకు ఒక సాంస్కృతిక ఉత్సవంలా అనిపిస్తుందని చిత్రబృందం చెబుతోంది.
ఇంకా ధోప్ సాంగ్ కోసం రష్యా నుండి ప్రత్యేకంగా 100 మంది డ్యాన్సర్లను హైదరాబాద్ తీసుకురావడం, ఐదో పాటను గోదావరి పరిసరాల్లో చిత్రీకరించడం సినిమాకే అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఈ పాటను థియేటర్లో చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని టాక్. ఈవిధంగా, పాటలలోనే భారీ పెట్టుబడులు పెట్టిన గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.