రామ్ చరణ్ ఇలా లాక్ అయిపోయాడేంటీ.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ చేశాడు. ఆ ‘ఆచార్య’ మరక వదిలించుకోవడానికి, వెంటనే ఓ సినిమాతో రావాల్సి వుంది. కానీ, ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. శంకర్‌తో సినిమా అంటే అలాగే వుంటుంది మరి.

సంక్రాంతి రేసు నుంచి గేమ్ ఛేంజర్ తప్పుకున్నట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఈ సినిమా గురించి అప్డేట్ ఎవరికీ తెలియడం లేదాయె.! షూటింగ్ మాత్రం జరుగుతూనే వుందిట. అదిగో పాట షూటింగ్, ఇదిగో యాక్షన్ పార్ట్ షూటింగ్.. ఇలా షూటింగ్ అప్డేట్స్ వస్తున్నాయ్. కానీ, వాటి ఇంపాక్ట్ పెద్దగా వుండటంలేదు.

క్రమంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రాజెక్ట్ మీద బజ్ తగ్గిపోతోంది. ఓ వైపు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ సినిమా కూడా తెరకెక్కుతోంది. అదే పెద్ద సమస్యగా మారింది. అదీ ముందుకు కదలడంలేదు.. ఇదీ ముందుకు కదలడంలేదాయె.

గ్యాప్‌లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, చరణ్ కొత్త సినిమా ఏదైనా, ఈసాటికి వచ్చేసేదే. కానీ, చరణ్ ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయాల్సిన సినిమాని హోల్డ్ చేసి పెట్టాడు. శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప, బుచ్చిబాబు సన దర్శకత్వంలో సినిమాని చరణ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళేలా లేడు.

ఇలా చరణ్ లాక్ అయిపోవడాన్ని ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.